జమ్మూ-కశ్మీరు స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్ దూరం  

జమ్మూ-కశ్మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొనరాదని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ నెల 24న జరిగే బ్లాక్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (బీడీసీ) ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర పరిపాలనా యంత్రాంగం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని, సీనియర్ పార్టీ నేతలను ఇప్పటికీ నిర్బంధంలో ఉంచారని, అందువల్ల తాము ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని పేర్కొంది.

జమ్మూ-కశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసి, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన అనంతరం జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవే.కాంగ్రెస్ జమ్మూ-కశ్మీరు శాఖ అధ్యక్షుడు జీ ఏ మిర్ విలేకర్లతో మాట్లాడుతూ ప్రజాస్వామిక వ్యవస్థలు బలపడాలని కాంగ్రెస్ కోరుకుంటుందని తెలిపారు. 

ఎన్నికల నుంచి కాంగ్రెస్ ఎప్పుడూ పారిపోదని చెప్పారు. బీడీసీ ఎన్నికలను బహిష్కరించాలనే నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయని చెప్పుకొచ్చారు. అక్టోబర్ 24న జమ్మూకశ్మీర్‌లో బీడీసీ ఎన్నికలు జరగనున్నాయి.