11న మల్లాపురంలో మోదీ, జిన్‌పింగ్‌ భేటీ

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఈనెల 11న ప్రధాని నరేంద్ర మోదీ తో భేటీ కానున్నారు. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు జిన్‌పింగ్‌ ఈనెల 11-12 తేదీల్లో చెన్నైను సందర్శిస్తారని ఇరువురు నేతల మధ్య రెండో ముఖాముఖి జరగనుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి వెల్లడించారు. 

పలు ద్వైపాక్షిక, ప్రాంతీయ, వాణిజ్య అంశాలతో పాటు అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాలపై మోదీ-జిన్‌పింగ్‌లు ఈ భేటీలో చర్చిస్తారని చెప్పారు. ఇది లాంఛనప్రాయ సమావేశంగా సాగనుండటంతో ఎలాంటి ఒప్పందాలు, ఎంఓయూలు ఉండబోవని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 

చైనా అధ్యక్షుడి వెంట ఆ దేశ విదేశాంగ మంత్రి, పొలిట్‌బ్యూరో సభ్యులు భారత పర్యటనలో పాల్గొననున్నారు. తమిళనాడులోని మమల్లాపురం పట్టణంలో ఇరు దేశాధినేతల భేటీ జరగనుంది. మోదీ, జిన్‌పింగ్‌ల మధ్య తొలి లాంఛనప్రాయ భేటీ 2018 ఏప్రిల్‌ 27.28న చైనాలోని వుహన్‌లో జరిగింది. 

ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధంలో జిన్‌పింగ్‌ పర్యటన కీలక పాత్ర పోషించనుందని సమాచారం. మరోవైపు కశ్మీర్‌పై పాకిస్తాన్‌ అంతర్జాతీయ వేదికలపై రాద్ధాంతం చేస్తున్న క్రమంలో చైనా అధ్యక్షుడితో ప్రధాని భేటీ పాక్‌కు ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.