పోలవరంపై తక్షణ విచారణకు ఢిల్లీ హై కోర్ట్ ఆదేశం 

పోలవరం ప్రాజెక్టులో అంతులేని అవినీతి చోటు చేసుకుందంటూ.. దాఖలైన పిటిషన్‌ ను బుధవారం ఢిల్లీ హైకోర్టు విచారించింది. ఈ పిటిషన్‌ ను సామాజికవేత్త పెంటపాటి పుల్లారావు వేశారు. ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.16 వేల కోట్ల నుంచి రూ.58 వేల కోట్లకు పెంచారని తన పిటిషన్‌ లో పేర్కొన్నారు. 

నామినేషన్‌ విధానంలో వేల కోట్ల రూపాయల పనుల టెండర్లను అప్పగిస్తున్నారని ఆరోపించారు. ఈ పిటిషన్‌ ను విచారించిన ఢిల్లీ హైకోర్టు కీలక ఉత్తర్వులను జారీ చేసింది. పిటిషన్‌ ను ఫిర్యాదుగా భావించి తక్షణమే విచారణ చేపట్టాలని కేంద్ర జలశక్తి శాఖకు ఆదేశాలు జారీ చేసింది.

మరోవైపు, హైకోర్టు ఆదేశాలపై పెంటపాటి పుల్లారావు హర్షాన్ని వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలతో పోలవరం పనుల్లో చోటు చేసుకున్న అవినీతి బయటపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో అవినీతికి పాల్పడిన అధికారులే... కొత్త ప్రభుత్వంలో కూడా బాధ్యతలను నిర్వహిస్తున్నారని ఆరోపించారు. 

పోలవరం పనుల్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న వైసిపి ప్రభుత్వం... ఇదే విషయంపై ఢిల్లీలో ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.