ఆర్టీసీ సమ్మెతో టీఆర్ఎస్ ప్రభుత్వ పతనం   

ఆర్టీసీ సమ్మెతో టీఆర్ఎస్ ప్రభుత్వ పతనం ప్రారంభమైందని బీజేపీ నేత, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు.  బుధవారం కరీంనగర్ లో ఆర్టీసీ సమ్మెకు సంఘీభావం తెలుపుతూ  సీఎం కేసీఆర్ అహంకారంతో ఆర్టీసి కార్మికులను అణగదొక్కాలని చూస్తున్నాడని ధ్వజమెత్తారు. నెలరోజుల ముందే సమ్మె నోటీస్ ఇచ్చినా… నోటీసులపై ఎలాంటి స్పందన లేకుండా మిన్నకుండిపోయారని దుయ్యబట్టారు. 

నేడు డ్యూటీలోకి రాని ఆర్టీసీ కార్మికుని ఉద్యోగం పోయినట్లే అని చెబుతున్న కేసీఆర్ ను….  సెక్రటేరియట్ కు రాకున్నా సీఎంగా ఎలా గుర్తించాలని ప్రశ్నించారు. “కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు.. ఒక్కసారి బస్సు స్టీరింగ్ తిప్పి చూడండి. టైర్ సెక్షన్లో ముక్కుకు గుడ్డ కట్టుకోకుండా కొద్దిసేపు వర్క్ షాపులో ఉండి చూడండి. ఆర్టీసీ డ్రైవర్, కండెక్టర్ ఆరోగ్యాలు పాడవుతున్నా కుటుంబపోషణ కోసం వాళ్లు పడే  కష్టం ఏంటో తెలుస్తుంది.” అని సంజయ్  హితవు చెప్పారు. 

క్యాన్సర్, లీవర్, గుండె జబ్బులతో ఆర్టీసీ కార్మికులు బాధపడుతున్నారని సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ మోహన్ రెడ్డితో రాత్రి పూట ముచ్చట్లు పెట్టే సీఎం.. అక్కడిలాగా ఇక్కడెందుకు ఆర్టీసీని ప్రభుత్వంలో  విలీనం చేయటం లేదని ప్రశ్నించారు. ఆర్టీసీ ఆస్తులను కబ్జా చేసి మల్టీ ప్లెక్స్ లు నిర్మించుకునే కుట్రలో భాగంగానే ప్రయివేటు పరం చేయాలని చూస్తున్నాడని సంజయ్ ఆరోపించారు. ఆంధ్రా ప్రయివేటు ట్రావెల్స్ తో కుమ్ముక్కై ఆర్టీసీని ప్రయివేటీకరణకు ప్రయత్నిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ప్రయివేటు పరం చేయడమంటే అక్రమ దోపిడికీ కుట్ర చేయడమేనని స్పష్టం చేశారు. సర్పంచులను, ఉద్యోగులను, ఆర్టీసీ కార్మికులను భయపెట్టాలని చూస్తున్నాడని సంజయ్ మండిపడ్డారు. ఉద్యోగాలు పోయినా పర్వాలేదంటూ ఆర్టీసీ కార్మికులు పట్టుదలపై ఉండటం గర్వకారణమని కొనియాడారు. "మీ ఉద్యమంలో  ముందుంటా.. ఆర్టీసీ కార్మికులంతా ఐక్యంగా ఉండాలి" అని సంజయ్ పిలుపునిచ్చారు.

అనుభవంలేని డ్రైవర్లతో బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతూ ప్రమాదాలు జరగాలని కేసీఆర్ కోరుకుంటున్నాడని ధ్వజమెత్తారు. ప్రమాదాలు జరిగితే ఆ తప్పిదాన్ని ఆర్టీసీ కార్మికులపై నెట్టాలని చూస్తున్నారని విమర్శించారు.  ఫైళ్లన్నీ మాయం చేసేందుకే సెక్రటేరియట్ మార్పు కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు. 

ఆర్టీసీ కార్మికుల పట్ల అనుచితంగా మాట్లాడిన మంత్రి తలసాని శ్రీనివాస్ అంతటి మూర్ఖుడు ఎవడూ లేడని సంజయ్ మండిపడ్డాయిరు. అధికారంలో ఎవరుంటే వారికి కొమ్ముకాసి మంత్రి పదవులు పొందే తత్వం తలసానిదని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో దొంగలాగా దాక్కొని,  ఇప్పుడు కేసీఆర్ మెప్పు పొందేందుకు ఆర్టీసీ కార్మికులను కించపరిచేలా మాట్లాడుతున్నాడని విమర్శించారు. 

రూ 50 వేల  జీతం ఏ ఆర్టీసీ కార్మికునికి వస్తుందో తలసాని నిరూపించాలని సంజయ్ డిమాండ్ చేశారు. “లక్షల రూపాయలు అక్రమంగా దోచుకున్నావ్.. బిడ్డా నీ సంగతి చెప్తాం. ఆర్టీసీ కార్మికులు గల్లీల్లో నిన్ను తరిమికొట్టే రోజులొస్తాయి.” అని బండి సంజయ్ హెచ్చరించారు.

అన్ని సంఘాలను చీల్చి సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడని అంటూ యూనియన్లకు అతీతంగా కార్మికులంతా ఒక్కటి కావాలని సంజయ్ పిలుపునిచ్చారు.  ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆర్టీసీకి మద్ధతునివ్వాలని, లేకుంటే మీకు కూడా ఇదే గతి పట్టడం ఖాయమని హెచ్చరించారు. బీజేపీ ఆర్టీసీ కార్మికులకు పూర్తి మద్ధతుగా ఉంటుందని భరోసా ఇచ్చారు.