పీఓకే వలస కుటుంబాలకు రూ 5.5 లక్షల పరిహారం 

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే) నుంచి జమ్మూ కాశ్మీర్ మినహా ఇతర రాష్ట్రాలకు వలస వచ్చిన 5000 కుటుంబాలను జమ్ము కశ్మీర్‌ నిర్వాసితుల జాబితాలో చేర్చి వారికి రూ 5.5 లక్షల పరిహారం అందిస్తామని కేంద్ర మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ వెల్లడించారు. ప్రధాన మంత్రి అభివృద్ధి ప్యాకేజ్‌ కింద ఆయా కుటుంబాలకు పరిహారం చెల్లిస్తామని చెప్పారు. 

ఈ కుటుంబాలు జమ్ము కశ్మీర్‌ మినహా ఇతర రాష్ట్రాల్లో స్ధిరపడటంతో వారి పేర్లు నిర్వాసితుల జాబితాలో లేవని, వారి పేర్లను చేర్చడం ద్వారా గతంలో జరిగిన చారిత్రక తప్పిదాన్ని తమ ప్రభుత్వం సవరిస్తోందని చెప్పుకొచ్చారు. జమ్ము కశ్మీర్‌ అభివృద్ధి కోసం ప్రకటించిన ప్రధానమంత్రి అభివృద్ధి ప్యాకేజ్‌ను కశ్మీర్‌లో పలు ప్రాజెక్టుల అమలుకు వెచ్చిస్తున్న సంగతి తెలిసిందే. 

ఈ ప్యాకేజ్‌ కింద పీఓకే నుంచి వలసవచ్చిన కుటుంబాలకు ప్రభుత్వం రూ 5.5 లక్షల పరిహారం సమకూరుస్తోంది. కేంద్ర కేబినెట్‌ భేటీ అనంతరం మంత్రి జవదేకర్‌ ఈ విషయం వెల్లడించారు.  

కాగా,  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు  నరేంద్ర మోదీ సర్కార్‌ దీపావళి కానుక అందించింది. డీఏ 5శాతం పెంపునకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపిందని ప్రకాష్‌ జవదేకర్‌  వెల్లడించారు. దీంతో ప్రస్తుతం ఉద్యోగులకు చెల్లించే 12 శాతంనుంచి 17శాతానికి పెరిగింది. తాజా పెంపుతో  కేంద్ర ప్రభుత్వానికి రూ 16వేల కోట్ల భారం పడనుందని కేంద్రమంత్రి వెల్లడించారు. 

పెంచిన డీఏను ఈ ఏడాది జూలై నుంచి అమలు చేయనున్నారు.  దీంతో 50 లక్షలమంది ఉద్యోగులకు, 62 లక్షలమంది పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది.  అంతేకాదు ఆశా వర్కర్కకు  కేంద్రం అందించే భత్యాన్ని రెట్టింపు చేస్తున్నట్టు కేంద్రమంత్రి  ప్రకటించారు. ఇప్పటివరకు  వెయ్యిరూపాయిలుగా ఉన్న ఈరెమ్యూనరేషన్‌  ప్రస్తుతం​ రూ. 2 వేలకు చేరింది.