పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన పాక్ 

పాకిస్తాన్‌లో తీవ్ర ఆర్ధిక సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ అందినచోటల్లా అప్పులు చేస్తున్నారు.  అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరంలోనే ఇమ్రాన్ ప్రభుత్వం 7,509 బిలియన్ల పాకిస్తానీ రూపాయల మేర  అప్పులు చేసి రికార్డు నెలకొల్పారు. స్థానిక మీడియా కథనం ప్రకారం ఈ మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ ఇప్పటికే ప్రధాన మంత్రి కార్యాలయానికి రుణాల వివరాలు పంపింది. 

ఈ వివరాల ప్రకారం 2018 ఆగస్టు నుంచి 2019 ఆగస్టు వరకు పాక్ ప్రభుత్వం విదేశాల నుంచి రూ.2,804 బిలియన్ల మేర అప్పులు తీసుకోగా.. దేశీయంగా రూ. 4,705 బిలియన్ల అప్పు చేసినట్టు తేలింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం తొలి రెండు నెలల్లోనే పాకిస్తాన్ ప్రభుత్వ అప్పులు 1.43 శాతం పెరిగినట్టు తాజాగా గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది ఆగస్టులో రుణాలు రూ.24,732 బిలియన్లు ఉండగా.. ఈ ఏడాది ఆగస్టులో అప్పులు రూ.32,240 బిలియన్లుగా ఉన్నాయి. 

కాగా ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 1 ట్రిలియన్ పాకిస్తానీ రూపాయల మేర పన్నులు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఇమ్రాన్ ప్రభుత్వం రూ. 960 బిలియన్ల మేర పన్నులు వసూలు చేసింది. మరోవైపు ఈ ఏడాది 2019 నాటికి పాకిస్తాన్ అప్పులు మొత్తం రూ. 31.786 ట్రిలియన్లకు చేరుకుంది. దీనికి అదనంగా మరో ఐదేళ్లలో 47 శాతం అంటే 45.57 ట్రిలియన్లకు పాకిస్తాన్ అప్పులు పెరగనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. 

సౌదీ అరేబియా, చైనా తదితర దేశాలు పాకిస్తాన్‌ను బెయిలవుట్ ప్యాకేజీలు ఇచ్చినప్పటికీ.. దాయాది దేశ ఆర్ధిక వ్యవస్థ గాడిలో పడకపోవడం గమనార్హం. ఈ ఏడాది జూన్‌లో ఖతార్ నుంచి పాకిస్తాన్ 3 ట్రిలియన్ డాలర్ల బెయిలవుట్ ప్యాకేజి అందుకుంది. గత 11 నెలల్లో పాకిస్తాన్ ఆర్ధిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ముందుకొచ్చిన గల్ఫ్ దేశాల్లో ఖతార్ నాలుగోది. అంతకు ముందు యూఏఈ కూడా 2 ట్రిలియన్ డాలర్ల మేర సొమ్ములు సమకూర్చింది. 

సంక్షోభంలో కూరుకుపోయిన తమ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు పాక్ ప్రభుత్వం మరోవైపు 6 బిలియన్ డాలర్ల ఉద్ధీపన ప్యాకేజీ కోసం అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వద్ద ప్రాథమిక ఒప్పందం చేసుకుంది. అంతర్జాతీయ ఆర్థిక సంస్థల ఋణం కోసం అమెరికాను ప్రసన్నం చేసుకోవాలని చూస్తున్నది. అందుకోసం చైనా సారథ్యంలో నిర్మిస్తున్న చైనా - పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్‌లో కొన్ని ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నది. 

సీపీఈసీ మొదటి ఫేజ్ కింద ఇప్పటికే పూర్తవ్వాల్సిన గ్వదార్ పోర్టు వంటి ప్రాజెక్టుల్లో ఈ జాప్యం స్పష్టంగా కనబడుతోంది. రెండో ఫేజ్‌ 2020 నాటికి పూర్తిచేయాలని చైనా భావిస్తుండగా.. అందులోనూ ఆశించిన పురోగతి కనిపించడంలేదు. అయితే చైనాను దూరం చేసుకోవడం కూడా ప్రమాదకరమే. అందుకే త్వరలోనే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చైనాలో పర్యటించబోతున్నట్లు తెలుస్తోంది.