అఖిలప్రియ భర్తపై హైదరాబాదులో మరో కేసు 

ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ మరిన్ని చిక్కుల్లో పడ్డారు. ఆయనపై మరో కేసు నమోదైంది. ఆళ్లగడ్డ పీఎస్ లో భార్గవ్ పై ఇప్పటికే రెండు కేసులు ఉండగా, ఇప్పుడు హైదరాబాద్ లో మరో కేసు నమోదయింది. 

ఆయన అరెస్టు నుంచి తప్పించుకుని తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో భార్గవ్ ను వెతుక్కుంటూ ఆళ్లగడ్డ ఎస్సై రమేశ్ బృందం హైదరాబాద్ వచ్చారు. సోమవారం సాయంత్రం తన కారు (నల్లరంగు ఫార్చునర్‌; ఏపీ 21 సీకే 0222)ను స్వయంగా నడుపుకుంటూ వెళుతున్నభార్గవను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు.

గచ్చిబౌలిలోని ఓక్ వుడ్ హోటల్ వద్ద భార్గవ కారు ఆపేందుకు పోలీసులు ప్రయత్నించగా, కారు ఆపినట్లే ఆపి దూకుడుగా ముందుకు ఉరికించడంతో ఎస్సై రమేశ్ బృందం ప్రమాదం నుంచి తప్పించుకుంది. అనంతరం భార్గవ్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు.  

దీంతో తనపైనే దాడికి యత్నించాడంటూ ఆ ఎస్సై గచ్చిబౌలి పోలీసులకు భార్గవ్ రామ్ పై ఫిర్యాదు చేశారు. విధుల్లో ఉన్న తమకు ఆటంకం కలిగించే ప్రయత్నం చేశాడని, కారుతో తమపైకి దూసుకువచ్చేందుకు యత్నించాడని తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఎస్సై రమేశ్ ఫిర్యాదుతో అఖిలప్రియ భర్తపై సెక్షన్ 353, 336 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.భార్గవరామ్‌ను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.