సచివాలయాన్ని మంగళగిరికి తరలించే యత్నం!

గత ప్రభుత్వపు నిర్మాణాలు అన్నింటిని ధ్వసం చేసే రీతిలో సాగుతున్న వై ఎస్  జగన్మోహన్‌రెడ్డి   ప్రభుత్వం తాజాగా సచివాలయాన్ని వెలగపూడి నుండి మంగళగిరికి తరలించే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తున్నది.  కొందరు సీనియర్‌ ఐఎఎస్‌ అధికారులు వెలగపూడితో పోలిస్తే మంగళగిరి సచివాలయానికి ఎలా అనుకూలమైనదో వివరిస్తూ ఒక నివేదికను ముఖ్యమంత్రికి అందజేసిన్నట్లు  చెబుతున్నారు. సీనియర్‌ అధికారుల నుండే ఈ ప్రతిపాదన రావడంతో సిఎం కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తున్నది. 

అధికారికంగా నిర్ణయాన్ని ప్రకటించడానికి కొంత సమయం పట్టినప్పటికీ సచివాలయాన్ని మంగళగిరికి తరలించడం ఖాయమని ఒకరిద్దరు సీనియర్‌ ఐఎఎస్‌లు బాహాటంగానే చెబుతున్నారు. 'తక్షణ ప్రత్యామ్నాయంగా నాగార్జున యూనివర్శిటిని ఎంపిక చేసుకోవచ్చు. ఏదైనా కారణాల వల్ల వద్దని అనుకుంటే పరిసర ప్రాంతాల్లోని ఖాళీ స్థలాల్లో నిర్మాణాలను ప్రారంభించినా ఏడాదిలో పూర్తవుతుంది,' అని ఇంకొకరు చెప్పారు. 

ప్రస్తుతం వెలగపూడిలో ఉన్న సచివాలయం విజయవాడకు 18 కిలోమీటర్లు, గుంటూరుకు 25 కిలోమీటర్లు, మంగళగిరికి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ మూడు ప్రారతాల నుంచి ప్రతి రోజూ సచివాలయానికి రావడానికి అనేక సమస్యలు ఎదుర్కోవాల్సివస్తుందని అధికారులు, ఉద్యోగులు చెబుతున్నారు. డబ్బులు ఖర్చు కావడమేగాక శారీరక శ్రమ కారణంగా సచివాలయానికి వెళ్లేటప్పటికే అలసిపోతున్నామని, విధి నిర్వహణపై దృష్టి సారించలేకపోతున్నామని అంటున్నారు. 

దైనందిన విధుల కోసం ఒకేరోజు వెలగపూడికి, గుంటూరు, ఇతర ప్రాంతాల్లో ఉన్న శాఖాధిపతుల కార్యాలయాలకు, తాడేపల్లిలో ఉన్న ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లాల్సి వస్తోందని, దీంతో రోజులో సగం ప్రయాణానికే కేటాయించాల్సి వస్తోందని భావిస్తున్నారు.  చంద్రబాబు ముఖ్య మంత్రిగా ఉన్న సమయంలో రూ 900 కోట్లతో సచివాలయం నిర్మించినప్పటికీ, అధికారులు. ఉద్యోగుల కోసం తలపెట్టిన అపార్ట్‌మెంట్ల నిర్మాణం పూర్తికాక పోవడాన్ని, నూతన ప్రభుత్వం వచ్చిన తరువాత పనులను పూర్తిగా ఆపేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. 

ఒకవేళ నిర్మాణాలు పూర్తయినా, పూర్తి స్థాయిలో వసతులు లేని ప్రాంతంలో ఉద్యోగులు కుటుంబాలతో సహా వచ్చి స్థిరపడటంపై అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తక్షణమే అన్ని సౌకర్యాలతో, రాకపోకలకు అనుగుణంగా ఉన్న మంగళగిరి ప్రాంతాన్ని ప్రతిపాదిస్తున్నారు. పైకి చెప్పకపోయినప్పటికీ, ప్రభుత్వ ఆలోచన కూడా అదే కావడంతో ఆ దిశలో అడుగులు పడటానికే అవకాశం ఎక్కువుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. ఇప్పటికే కృష్ణా, గురటూరు జిల్లాల్లోని వివిధ ప్రారతాల్లో విసిరేసినట్టున్న శాఖాధిపతుల కార్యాలయాలు మంగళగిరి ప్రాంతానికి తీసుకువచ్చేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి.