వైమానికదళం అమ్ములపొదిలో రఫేల్‌ 

భారత వైమానికదళం అమ్ములపొదిలో మరో అత్యంత ముఖ్యమైన అస్త్రం చేరింది. ఫ్రాన్స్‌ దేశం తయారు చేసిన రఫేల్‌ యుద్ధవిమానం ఇవాళ భారత్‌కు అందింది. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మాక్రన్‌ చేతుల మీదుగా భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ రాఫెల్‌ అందుకున్నారు. 

డసోల్ట్‌ ఏవియేషన్‌ తయారీ కేంద్రంలో రాజ్‌నాథ్‌ తొలి రఫేల్‌ను స్వీకరించారు. అనంతరం విమానానికి రాజ్‌నాథ్‌ దసరా పండుగను పురస్కరించుకొని ఆయుధపూజ నిర్వహించారు. పూలు, నిమ్మకాయలతో ఫారెన్ లోనూ దసరా సంప్రదాయాన్ని ఆచరించారాయన. బోర్డియాక్స్‌లో రఫేల్‌ యుద్ధవిమాన స్వీకరణ కార్యక్రమం జరిగింది. 

ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ మాట్లాడుతూ..'అనుకున్న సమయానికి రాఫేల్‌ అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. రాఫేల్‌ రాకతో భారత వాయుసేన మరింత బలోపేతం అవుతుంది. రెండు ప్రధాన ప్రజాస్వామ్య దేశాల మధ్య సహకారం అన్ని రంగాల్లో మరింత పెరుగుతుందని నేను ఆశిస్తున్నాను. ఇవాళ భారత్‌-ఫ్రాన్స్‌ వ్యూహాత్మక భాగస్వామ్యంలో సరికొత్త అధ్యాయం' అని పేర్కొన్నారు. 

రఫేల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ప్రయాణించాలని ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు చెబుతూ ఇవాళ చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా భారత్‌లో దసరా పండుగ (విజయదశమి) జరుపుకుంటామని, 87వ ఎయిర్‌ఫోర్స్‌ డే కూడా ఇవాళేనని  రాజ్‌నాథ్‌ తెలిపారు. రఫేల్‌ సామర్థ్యం మేర రాణిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ వాయుసేనలో భారత్‌ బలోపేతమై ఈ ప్రాంతంలో శాంతిభద్రతల బలోపేతానికి మార్గం సుగమమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

రాజ్ నాథ్ కోరిన వెంటనే ఫ్రాన్ అధికారులు ఏర్పాట్లు చేసేశారు. రాఫెల్ తయారీ కంపెనీ దసాల్ట్ హెడ్ టెస్ట్ పైలట్ ఫిలిప్ జెట్ లోకి ఎక్కారు. రాజ్ నాథ్ ను తనతో పాటు రాఫెల్ లో కూర్చోబెట్టుకుని ఆకాశంలోకి దూసుకెళ్లారు. 35 నిముషాలసేపు ఆకాశంలో విహరించారు. రాఫెల్ లో ప్రయాణం  చాలా సౌకర్యంగా, స్మూత్ గా అనిపించిందని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. తాను సూపర్ సోనిక్ యుద్ధ విమానంలో ప్రయాణించే రోజు వస్తుందని ఎప్పుడూ ఊహించలేదని చెప్పారు.

గత నెలలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తేలికపాటి యుద్ద విమానం తేజస్ లో రాజ్ నాథ్ సింగ్ ప్రయాణించారు. అలాగే యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య లోనూ ఆయన పర్యటించారు. సైనికుడిలా మారి మెషీన్ గన్ ను కాల్చారు.  

అంతకుముందు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మాక్రన్‌తోనూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ భేటీ అయ్యారు. రెండు దేశాల రక్షణ, వ్యూహాత్మక సంబంధాల బలోపేతంపై చర్చించారు. భారత్‌, ఫ్రాన్స్‌ బలమైన ద్వైపాక్షిక బంధాన్ని ఈ భేటీ చాటిందని రక్షణ శాఖ పేర్కొంది. బోర్డియాక్స్‌లో రఫేల్‌ యుద్ధ విమాన తయారీ కేంద్రాన్ని రాజ్‌నాథ్‌ పరిశీలించారు.