రావణ దహనం చేసిన ప్రధాని మోడీ

మంచి సంకల్పంతో ముందుకు సాగుదామని భారత ప్రజలకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో నిర్వహించిన దసరా వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. రావణుడిపైకి బాణం వేశారు. రావణ దహన కార్యక్రమాన్ని తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజయదశమి సందర్భంగా.. ప్రజలంతా మంచి సంకల్పం తీసుకోవాలని కోరారు.  

మహాత్మా గాంధీ 150వ జయంతి, గురు నానక్ 550వ జయంతి లాంటి సందర్భాలు అరుదుగా వస్తుంటాయని చెప్పారు మోడీ. ఇలాంటి సందర్భాల్లో రిజల్యూషన్ తీసుకోవాలని సూచించారు. ఆహారాన్ని వృథా చేయకపోవడం, విద్యుత్ సంరక్షణ, నీటిని పొదుపు చేయడంలాంటివాటిని గురించి సంకల్పబద్ధులై పనిచేయాలని పిలుపిచ్చారు. 

"అమ్మను పూజించే గడ్డ మనది. దేశంలోని ప్రతి ఆడబిడ్డను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉంది. మన్‌కీ బాత్ సందర్భంగా కూడా నేను ఇదే విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించాను. ఆడపిల్లలు ‘లక్ష్మీ’దేవి స్వరూపాలనీ.. ఈ దీపావళి సందర్భంగా వారి విజయాలను వేడుకలా జరుపుకోవాలని నేను చెప్పాను..’’ అని ప్రధాని గుర్తుచేశారు.  

మన దేశంలో పండుగలు.. విలువల్ని, విద్యను నేర్పుతాయని, సామాజిక జీవితాన్ని తీర్చిదిద్దుతాయని మోడీ తెలిపారు. పండుగలు మనల్ని ఏకం చేస్తాయని చెప్పారు.  కొత్త ఆశలు, ఆశయాల వైపు నూతనోత్తేజంతో పయనించేలా చేస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

కాగా దసరా వేడుకల సందర్భంగా రావణుడి బొమ్మపైకి మోదీ బాణం వేసి నిప్పంటించారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ప్రధాని తన ట్విటర్‌ ఖాతాలో షేర్ చేసుకున్నారు. ‘‘శ్రీ రామచంద్రుని ఆశీర్వాదాలు మనపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్ధిస్తున్నాను. సత్యానికున్న బలం, మంచితనం, కరుణలదే ఎల్లప్పుడూ పైచేయి అవ్వాలి. చెడు నశించాలి. జైశ్రీరాం..’’ అని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు.