ఆధార్ నంబర్ ను లాక్, అన్ లాక్ చేసుకోవచ్చు 

మీ ఆధార్ వివరాలను ఎవరైనా దొంగిలిస్తున్నారని కానీ, దుర్వినియోగం చేస్తున్నారని కానీ అనుమానిస్తున్నారా ? అందుకే... ఎందుకైనా మంచిది., మన జాగ్రత్తలో మనముండడం మంచిది. కానీ ఎలా ? ఇందుకోసమే... ‘యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ)’ ఓ కొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టింది. 

మీ ఆధార్ నంబర్ ను లాక్, అన్ లాక్ చేసుకునే కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఒక వ్యక్తి ఆధార్ సంఖ్య గోప్యత, భద్రతను మరింత బలోపేతం చేయడానికి ఈ చర్య తీసుకున్నట్లు యూఐడీఏఐ వెల్లడించింది. 

మన అధార్ నంబర్ ను లాక్ చేసుకుంటే... ఆ తర్వాత మరే ఇతర అవసరాలకు ఎవరూ ఉపయోగించలేరు. ఉదా: జనాభా, బయోమెట్రిక్ లేదా వన్ టైమ్ పాస్‌వర్డ్ తదితర అంశాలు సహా ఇతరత్రా ప్రక్రియలకు ఆధార్ సంఖ్యను ఉపయోగించి చేయలేరు. ఆధార్ నంబర్‌ను అన్‌లాక్ చేసిన తర్వాత మాత్రమే గుర్తింపు అవసరాల కోసం ఉపయోగించవచ్చు. 

మీరు ఆధార్ నంబర్ ను లాక్ చేసే ముందు వర్చువల్ ఐడీని జనరేట్ చేసుకోవాలి. వర్చువల్ ఐడీని జనరేట్ చేసుకోకపోతే మీ ఆధార్ నంబర్‌ను లాక్ చేయలేరు. మీరు యూఐడీఏఐ వెబ్‌సైట్ నుండి లేదా ఎస్ఎంఎస్ పంపడం ద్వారా మీ వర్చువల్ ఐడీ ని రూపొందించుకోవచ్చు.

పూర్తి వివరాల కోసం తమ వెబ్‌సైట్ ‘www.uidai.gov.in’లోకి వెళ్ళాలని యూఐడీఏఐ వర్గాలు వెల్లడించాయి. ఇక ఇంటర్నెట్‌కు సౌకర్యం లేకపోతే లేదా మీరు యూఐడీఏఐ వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయలేకపోతే ఎస్ ఏం ఎస్ ద్వారా మీ ఆధార్ నంబర్‌ను కూడా లాక్ / అన్‌లాక్ చేయవచ్చు. మీ మొబైల్ నంబర్ నుంచి 1947 కు ఎస్సెమ్మెస్ పంపడం ద్వారా కూడా ఆధార్ నంబర్‌ను లాక్ / అన్‌లాక్ ఇలా చేసుకోవచ్చు.