పాక్ నుంచి దూసుకొచ్చిన మరో డ్రోన్

పాకిస్థాన్ అంతర్జాతీయంగా ఏకాకి అయినా భారత్ వ్యతిరేక వైఖరిలో మార్పు కనిపించడం లేదు. భారత దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడంతోపాటు అనేక రకాలుగా నష్టం కలిగించడానికి కుట్ర పన్నుతోంది. 26/11 తరహాలో భయానక దాడులు నిర్వహించడమే లక్ష్యంగా పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ప్రయత్నిస్తోంది. దీని కోసం డ్రోన్‌ల ద్వారా భారత్‌లోకి ఆయుధాలను పంపుతోంది. 

డ్రోన్‌లు దాదాపు 8 సార్లు పంజాబ్‌లో ప్రవేశించినట్లు ఆ రాష్ట్ర పోలీసులు ధ్రువీకరించారు. సోమవారం రాత్రి మరో డ్రోన్ భారత భూభాగంలో దాదాపు కిలోమీటర్ వరకు వచ్చినట్లు సైన్యం గమనించింది. దీని కోసం గాలింపు జరుగుతోంది. పంజాబ్‌లోని హుసేనీవాలా సెక్టర్‌లో సోమవారం రాత్రి 10 నుంచి 10.40 గంటల మధ్యలో ఓ హై ఫ్లయింగ్ డ్రోన్ వంటి వస్తువు కనిపించిందని తెలుస్తోంది. పాకిస్థాన్ భూభాగంలో నాలుగుసార్లు, భారత భూభాగంలో ఒకసారి ఈ డ్రోన్ కనిపించిందని చెప్తున్నారు. 

ఇది భారత భూభాగంలోకి దాదాపు ఒక కిలోమీటర్ దూరం వరకు రావడం కనిపించింది. దీనిని గమనించిన బీఎస్ఎఫ్ జవాన్లు వెంటనే తమ ఉన్నతాధికారులకు సమాచారం తెలిపినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులు తక్షణమే పంజాబ్ పోలీసులను సంప్రదించారని, సంయుక్తంగా ఆ డ్రోన్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారని తెలుస్తోంది.

సెప్టెంబరులో పాకిస్థాన్ నుంచి హెవీ లిఫ్టింగ్ డ్రోన్‌లు భారత్‌లో ప్రవేశించి, పంజాబ్‌లోని తరన్ తరన్ జిల్లాలో పెద్ద ఎత్తున ఏకే-47 రైఫిల్స్, శాటిలైట్ ఫోన్లు, గ్రెనేడ్లను దించినట్లు గుర్తించారు. పంజాబ్‌లో మతపరంగా ప్రాధాన్యంగల ప్రదేశాలపై భీకర దాడులు చేయడం కోసమే ఈ ఆయుధ సామగ్రిని పాకిస్థాన్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) పంపినట్లు అనుమానిస్తున్నారు.