కాశ్మీర్ లో ప్రశాంతతకై అమిత్ షా ముమ్మర ప్రయత్నాలు  

జమ్మూ-కశ్మీరులో ప్రశాంతత, సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రయత్నాలు ముమ్మరం కావించారు. కశ్మీరు లోయలో స్థానికులతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలని బీజేపీ నేతలను ఆదేశించారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం అమిత్ షా కశ్మీరు బీజేపీ నేతలతో మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో మత పెద్దలు, వ్యాపారులు, హోటళ్ళ యజమానులు, పర్యాటక రంగంలోనివారు, స్థానిక ప్రజలు వంటివారితో సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పినట్లు తెలుస్తోంది.

అమిత్ షా కశ్మీరు బీజేపీ నేతలతో జరిపిన సమావేశంలోనే ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. కశ్మీరు అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం చాలా కార్యక్రమాలను అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. విద్యా సంస్థలను తిరిగి తెరవడంతోపాటు ప్రభుత్వోద్యోగులు తమ విధులను నిర్వహించేలా చేయడం కోసం కృషి జరుగుతోంది. అదేవిధంగా పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. 

నవంబరు లేదా డిసెంబరులో పెట్టుబడిదారుల సదస్సును కశ్మీరులో ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించిన తేదీలను త్వరలోనే ఖరారు చేస్తారు. ఇదిలావుండగా, గురువారం నుంచి పర్యాటకులను అనుమతిస్తామని జమ్మూ-కశ్మీరు గవర్నర్ సత్యపాల్ మాలిక్ ప్రకటించారు.

జమ్మూ-కశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన రాజ్యాంగంలోని అధికరణ 370ని ఆగస్టు 5న రద్దు చేశారు. అంతేకాకుండా ఆ రాష్ట్రాన్ని జమ్మూ-కశ్మీరు, లడఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు. ఈ నేపథ్యంలో కశ్మీరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాజీ ముఖ్యమంత్రులు ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలను గృహ నిర్బంధంలో ఉంచారు. 

నేషనల్ కాన్ఫరెన్స్ నేతలు అబ్దుల్లాలను, పీడీపీ నేతలు మెహబూబా ముఫ్తీని ఇటీవలే కలిసి, మాట్లాడారు. వీరిని త్వరలోనే గృహ నిర్బంధం నుంచి విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు జమ్మూ-కశ్మీరులో స్థానిక సంస్థల ఎన్నికలు ఈ నెలలోనే జరుగుతున్నాయి.