భౌతికశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్‌

భౌతికశాస్త్రంలో విశేష పరిశోధనలు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలను 2019 సంవత్సరానికి గానూ ప్రఖ్యాత నోబెల్‌ పురస్కారం వరించింది. జేమ్స్‌ పీబుల్స్‌, మైఖేల్‌ మేయర్‌, డిడియర్‌ క్యులోజ్‌లకు భౌతిక శాస్త్రంలో ఈ పురస్కారాన్ని ఉమ్మడిగా అందజేయనున్నట్టు నోబెల్‌ అసెంబ్లీ మంగళవారం ప్రకటించింది. 

వారిలో పీబుల్స్‌ కెనడియన్‌ అమెరికన్‌ కాగా, మైఖేల్‌, క్యులోజ్‌లు స్విట్జర్లాండ్‌కు చెందినవారు. విశ్వసృష్టిలో సైద్ధాంతిక అవిష్కరణలకు గానూ వారు నోబెల్‌ పురస్కారాన్ని అందుకోనున్నారు. మొత్తం ప్రైజ్‌మనీ అయిన 9.18 లక్షల అమెరికన్‌ డాలర్లలో సగం పీబుల్స్‌కు వెళ్లగా, మిగతా సగాన్ని మైఖేల్‌, క్యులోజ్‌ పంచుకోనున్నారు. 

డిసెంబర్‌ 10వ తేదీన స్టాక్‌హోమ్‌లో జరిగే కార్యక్రమంలో వారు నోబెల్‌ పురస్కారం అందుకోనున్నారు. కాగా, సోమవారం వైద్య రంగానికి సంబంధించి నోబెల్‌ విజేతలను ప్రకటించిన సంగతి తెలిసిందే.