పీపీఏలకు రాష్ట్ర ప్రభుత్వాలు, డిస్కమ్‌లు కట్టుబడాల్సిందే  

పవన, సౌర విద్యుత్తు సంస్థలతో కుదుర్చుకున్న పీపీఏలకు రాష్ట్ర ప్రభుత్వాలు, డిస్కమ్‌లు కట్టుబడాల్సిందేనని కేంద్రం ఆదేశాలు జారీచేసే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 11, 12తేదీల్లో గుజరాత్‌లో కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ నేతృత్వంలో అన్ని రాష్ట్రాల విద్యుత్తు శాఖా మంత్రుల సమావేశం జరగనుంది. ఈ భేటీకి సంబంధించిన ప్రధాన అజెండాలో పీపీఏల అంశాన్ని కూడా చేర్చారు.  

ఏపీలో విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలపై (పీపీఏ) ‘పునఃసమీక్ష’ జాతీయ, అంతర్జాతీ య స్థాయిలో వివాదాస్పదం కావడంతో కేంద్రం అప్రమత్తమైంది. ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కుదుర్చుకున్న పీపీఏలను మరో పార్టీ అధికారంలోకి రాగానే రద్దు చేస్తామనడం, పునఃసమీక్ష పేరిట ధరలు తగ్గించాలని ఉత్పత్తి సంస్థలపై ఒత్తిడి వంటివి సరికాదనే నిర్ణయానికి వచ్చింది. ఈ వ్యవహారంపై మొత్తం అన్ని రాష్ట్రాలకూ స్పష్టత ఇవ్వాలని భావిస్తోం ది. 

ఉత్పత్తి సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని కేంద్ర మంత్రి సూచించబోతున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఒప్పందాలను కొన్ని రాష్ట్రాలు పాటించకపోవడంవల్ల పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తికి విఘాతం కలుగుతుందని, తద్వారా కేంద్రం నిర్దేశించుకున్న లక్ష్యాలకు భంగం వాటిల్లుతుందని భావిస్తున్నారు. అంతేకాకుండా, పెట్టుబడుల సమస్య కూడా ఏర్పడుతుందని కేంద్రానికి వివరించారు. 

విద్యుత్తు సం స్థలు కూడా ఆర్థికంగా నష్టపోతాయని, తద్వారా బ్యాంకు రుణాల తిరిగి చెల్లింపులు నిలిచిపోయి బ్యాంకింగ్‌ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని నివేదించారు. పీపీఏల రద్దుతో తలెత్తిన పర్యవసనాలపై సీఎం జగన్‌కు ఆర్కే సింగ్‌ ఇప్పటికే లేఖ రాశారు. ఇలాంటి పరిస్థితులు ఇతర రాష్ట్రాల్లో తలెత్తకుండా చూడటమే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని తెలుస్తోంది. 

కొన్ని రాష్ట్రాల్లో విద్యుత్తు సంస్థలకు సకాలంలో చెల్లింపులు జరగడం లేదని కేంద్రానికి ఫిర్యాదులు వచ్చాయి. ఒక్క ఏపీలోనే పలు విద్యుత్తు సంస్థలకు డిస్కమ్‌లు రూ.13,046 కోట్ల మేర బకాయి పడినట్లు కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. అలాగే అనేక రాష్ట్రాలు బ్యాంకు గ్యారెంటీలు ఇవ్వడం లేదనే విషయం కూడా కేంద్రం దృష్టికి వచ్చింది. ఈ అంశాలన్నింటిపైనా విద్యుత్తు శాఖా మంత్రుల సమావేశంలో కేంద్రం అన్ని రాష్ట్రాలకు మార్గనిర్దేశం చేసే అవకాశముందని తెలిసింది.