భవన నిర్మాణ కా ర్మికులను రూ 10 వేలు పరిహారమివ్వాలి 

నూతన ఇసుక విధానంతో ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ రంగ కార్మికులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని, వారికి త క్షణమే నెలకు రూ.10 వేలు పరిహారంగా చెల్లించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షు డు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన ఇసుక విధానం లోపభూయిష్టంగా ఉందని విమర్శించారు. 

ఈ విధానానికి వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగా సోమవారం విజయవాడ, గుంటూరులో చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. లెనిన్‌ సెంటర్‌ వద్ద భిక్షాటన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన పార్టీ నాయకులతో కలిసి బీసెం ట్‌ రోడ్డు, బందరు రోడ్డు, రాఘవయ్య పార్కు వరకు భిక్షాటన చేశారు.

కార్మికులు ఖాళీ గమేళాలతో నిరసన తెలిపారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భిక్షాటన ద్వారా వచ్చినమొత్తా న్ని కన్నా భవన నిర్మాణ కూలీల సంఘం అధ్యక్షుడికి అందజేశారు. రాష్ట్రంలో అధికార పార్టీ నేతలకు ఇసుక ఆదాయ వనరుగా మారిందని కన్నా ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 50 లక్షల మందికి పైగా భవన నిర్మాణ కార్మికులు ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వలన ఆకలితో అలమటిస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. 

వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడుస్తున్నా ఇసుక సరఫరాపై స్పష్టమైన విధానం లేకపోవడం విచారకరమన్నారు. ఇసుక కొరతతో కార్మికులు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రభుత్వం నూతన పాలసీని తెచ్చినా ఎక్కడా సామాన్యులకు ఇసుక దొరకక నిర్మాణాలు నిలిచిపోయి, కార్మికులు ఖాళీగా ఉంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 

ముఖ్యమంత్రికి పరిపాలనపై అవగాహన లేకుంటే మంచి సలహాదారులను పెట్టుకోవాలని కన్నా హితవు చెప్పారు. సీఎం జగన్‌ అనుభవరాహిత్యం, లెక్కలేనితనం వలన రాష్ట్రంలోని లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారని విమర్శించారు. సెప్టెంబరు 5న నూతన ఇసుక విధానం అంటూ ముహూర్తం పెట్టినా.. అక్టోబరు 7 వచ్చినా ఇసుక దొరకడం లేదని ఎద్దేవా చేశారు.