ఆర్టీసీ కార్మికులతో పెట్టుకుంటే అగ్గితో గోక్కోవడమే 

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ అండగా ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ హామీ ఇచ్చారు. నేషనల్ మజ్దూర్ యూనియన్ నేతలు ఎం నాగేశ్వరరావు, పీ కమల్ రెడ్డి, పీ లక్ష్మణ్, ఎం నరేందర్, సీ చెన్నారెడ్డి, మహ్మాద్ వౌలాన సహా పలువురు నేతలు  లక్ష్మణ్‌ను కలిసి ఆర్టీసీ కార్మికులకు మద్దతు ఇవ్వాలని కోరారు. 

ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ సకల జనుల సమ్మె చేసినపుడు పేద కార్మికుడు సైతం పస్తులుండి పాల్గొన్నారని , సీఎం ప్లేట్ ఫిరాయించి యూ టర్న్ తీసుకుంటే ఏమైందో గమనించాలని హితవు చెప్పారు. ఆర్టీసీ కార్మికులతో పెట్టుకుంటే అగ్గితో గోక్కోవడమేనని కేసీఆర్ ను హెచ్చారించారు. ఆర్టీసీ కార్మికులను రాత్రికి రాత్రి తొలగించడం అగ్గితో పెట్టుకోవడమేనని స్పష్టం చేశారు.

ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులను తొలగిస్తామంటూ ప్రభుత్వం చేసిన ప్రకటన సబబుకాదని, ప్రజాస్వామ్య విరుద్దమని లక్ష్మణ్ విమర్శించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సమ్మె చేస్తున్న కార్మికులు, ఉద్యోగులను ఉన్నపళంగా తొలగిస్తామనడం టీఆర్‌ఎస్ నియంతృత్వ వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. ‘ఆర్టీసీ కార్మికులతో పెట్టుకుంటే మసైపోతారం’టూ సమైక్య పాలకులను కేసీఆర్ గతంలో హెచ్చరించారని గుర్తు చేశారు.

టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఖరితో ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులకు దసరా చేదుగా మారిందని విచారం వ్యక్తం చేశారు. దసరా సందర్భంగా టీఆర్‌ఎస్ నేతలకు సద్భుద్ధిని భగవంతుడు ప్రసాదించాలని కోరారు.