రవిప్రకాష్ ఆస్తులపై ఈడీ, సీబీఐ విచారణ జరిపించాలి  

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ ఆస్తులపై ఈడీ, సీబీఐ విచారణ జరిపించాలని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌కి లేఖ రాశారు.

ఫెమా, ఆర్‌బీఐ రెగ్యులేషన్స్‌, మనీలాండరింగ్‌తోపాటు ఇన్‌కంటాక్స్ ఎగ్గొట్టడం ద్వారా అక్రమాస్తులు కూడబెట్టారంటూ లేఖలో ఫిర్యాదు చేశారు. రూ.వందల కోట్ల మేర మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని, విదేశాల్లో పెద్దఎత్తున నల్లధనాన్ని దాచిపెట్టడంతో పాటు భారీ మొత్తంలో విదేశీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని తెలిపారు. 

మొయిన్‌ ఖురేషి, సానా సతీష్‌తో కలిసి చాలా మందిని మోసం చేశారని ఆరోపించారు. సానా సతీష్, మొయిన్ ఖురేషి, రవిప్రకాష్ కలిసి నకిలీ డాక్యుమెంట్లతో నగల వ్యాపారి సుఖేష్ గుప్తాను బెదిరించి హవాలాకు పాల్పడ్డారని విజయసాయి ఆరోపణలు చేశారు. హవాలా సొమ్మును కెన్యా, ఉగాండాల్లో సిటీ కేబుల్‌లో రవిప్రకాష్‌ పెట్టుబడులు పెట్టారని చెప్పారు. 

రవిప్రకాశ్, అతని భార్య దేవిక మీడియా ఎన్‌ఎక్స్‌టీ లిమిటెడ్‌లో చైర్మన్, డైరెక్టర్‌గా ఉన్నారు. ఇందుకు సంబంధించి ఇండో జాంబియా బ్యాంక్‌లో ఖాతా కూడా ఉంది. ఈ వివరాలను కూడా వీరు బహిర్గతం చేయలేదు. జాతి ప్రయోజనాలను ఆశించి ఈ ఫిర్యాదు చేస్తున్నా. ఈ ఆధారాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని రవిప్రకాశ్, అతని భార్య దేవిక, ఇతర సహాయకుల అక్రమాలు, అక్రమార్జనపై ఈడీ, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని అభ్యర్థిస్తున్నట్లు తన లేఖలో కోరారు.