ఆర్టీసీ మూడు ముక్కలు.. 20 శాతం ప్రైవేటుకి

ఆర్టీసీని  ప్రయివేటీకరణ చేయడం ఏ మాత్రం ఇష్టం లేదనీ చెబుతూనే దానిని మూడు ముక్కలుగా చేసి, 20 శాతం ప్రైవేట్ పరం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రకటించారు.  ఆర్టీసీని పటిష్టపరచడానికి ఈ  చర్యలు చేపడుతున్నామని చెబుతూ క్రమశిక్షణను తప్పకుండా అమలు చేసి ఆర్టీసీని లాభాల బాటలో నడిపించడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.  

రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో చర్చించారు. ప్రస్తుతం ఆర్టీసీలో ఉన్న 10 వేల 400 బస్సులను…. భవిష్యత్ లో మూడు రకాలుగా విభజించి నడపాలని నిర్ణయించారు. 

50% బస్సులు అంటే 5200 పూర్తిగా ఆర్టీసీకి చెందినవై, ఆర్టీసీ యాజమాన్యంలోనే ఉంటాయి. 30%.. అంటే 3100 బస్సులు అద్దె రూపేణా తీసుకుని వాటిని కూడా పూర్తిగా ఆర్టీసీ పర్యవేక్షణలోనే, ఆర్టీసీ పాలన కిందే నడుపుతారు. వాటిని ఆర్టీసీ డిపోల్లోనే ఉంచుతారు. మరో 20%.. అంటే 2100 బస్సులు పూర్తిగా ప్రైవేట్‌వి. ప్రైవేట్ స్టేజ్‌క్యారేజ్‌విగా అనుమతి ఇస్తారు. ఈ బస్సులు పల్లెవెలుగు సర్వీసు కూడా నడపాలి. అద్దెకు తీసుకున్న బస్సులు, స్టేజ్‌క్యారేజ్ బస్సులు ఇతర రూట్లతోపాటు నగరంలోనూ నడపాలి అని చెప్పారు.   

ఇప్పటికే 21% అద్దె బస్సులను ఆర్టీసీ నడుపుతున్నది. అంటే, ఇక అద్దెకు తీసుకోవాల్సింది అదనంగా మరో 9% మాత్రమే. అదనంగా 9% అద్దె బస్సులను పెంచడం అంటే ఆర్టీసీకి కొత్త బస్సులు వచ్చినట్లే అని సీఎం తెలిపారు.  

ఈ చర్యలన్నీ చేపట్టడానికి ప్రధానకారణం ఆర్టీసీ యూనియన్ల అతిప్రవర్తనేనని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తాము ఎక్కిన చెట్టుకొమ్మను తామే నరుక్కున్నారు. గత 40 ఏండ్లుగా జరుగుతున్న దాష్టీకంవల్ల ఇదంతా చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు.  ఏ ప్రభుత్వం వున్నా కార్మిక సంఘాల ప్రవర్తనలో మార్పు రావడం లేదని ధ్వజమెత్తారు.  ప్రభుత్వం ఎవర్నీ డిస్మిస్ చేయలేదని…. వాళ్ళంతట వాళ్ళే తొలగిపోయారని చెప్పారు. గడువులోగా విధుల్లో చేరకపోవడంతో వాళ్ళది “సెల్ఫ్ డిస్మిస్” అయినట్లేనని ప్రకటించారు. 

 డిపోలు, బస్ స్టేషన్ల దగ్గర గొడవ చేయకుండా ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేయాలని డీజీపీని ఆదేశించారు ముఖ్యమంత్రి. విధుల్లో ఉన్న 1200 మంది తప్ప ఎవరు వచ్చి దురుసుగా ప్రవర్తించినా…  చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భవిష్యత్‌లో ఇక ఆర్టీసీలో యూనియనిజం ఉండదని స్పష్టం చేశారు.