2014లోకన్నా ఎక్కువ సీట్లు, మెజారిటీ ఖాయం

‘కేంద్రంలో మళ్లీ అధికారంలోకి మేమే వస్తాం. 2014 ఎన్నికల్లోకన్నా ఎక్కువ సీట్లు గెలుచుకుంటాం. మెజారిటీ కూడా పెరుగుతుంది. ఇందుకు మా ఫార్ములా మాకుంది. గతంలో ఏ ప్రభుత్వాలూ చేయని ప్రయత్నాలు మేం చేశాం. దేశంలోని 50 కోట్ల మంది ప్రజలు తలెత్తుకునేలా పాలించాం.

నాలుగున్నరేళ్లలో 13 రాష్ట్రాల ప్రజల మద్దతు పొంది అధికారంలోకి వచ్చాం. మేమేం చేసినా పేదల కోసమే. అభివృద్ధే ప్రధాన నినాదంగా లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొంటాం. ప్రధాని మోదీపై ఉన్న విశ్వాసంతోనే ప్రజల్లోకి వెళతాం. గెలిచి తీరుతాం’అని బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా ధీమా వ్యక్తం చేశారు.

ఒక్క రోజు తెలంగాణ పర్యటన కోసం రాష్ట్రానికి వచ్చిన ఆయన ‘సాక్షి’ ప్రతినిధులు కంచర్ల యాదగిరిరెడ్డి/మేకల కల్యాణ్‌ చక్రవర్తిలకు ఇచిన ఇంటర్వ్యూలో పలు అంశాలను ప్రస్తావించారు.

కేంద్రంలో కచ్చితంగా ఇప్పటికన్నా ఎక్కువ సీట్లు వస్తాయి. గత ఎన్నికల్లో వచ్చినంత మెజారిటీకన్నా ఎక్కువ సీట్లు మేం గెలవబోతున్నాం. ఇందుకోసం మా ఫార్ములా మాకుంది. మేం గెలిచి తీరుతాం. దేశంలోని ప్రతి రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితులున్నాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పార్టీని ఎదుర్కోవాల్సి ఉంది.

అభివృద్ధే మా ప్రధాన నినాదం. గత నాలుగున్నరేళ్ల పాలనలో దేశంలోని 50 కోట్ల మంది ప్రజలు తలెత్తుకునేలా మేం పాలించాం. 5 కోట్ల మందికిపైగా మహిళలకు గ్యాస్‌ సిలిండర్లు ఇచ్చాం. 7.5 కోట్ల మందికి టాయిలెట్స్‌ నిర్మించాం. 18 కోట్ల మంది మహిళలు, చిన్నారులకు టీకాలు వేయించాం. 2 కోట్ల ఇళ్లకు విద్యుత్‌ సౌకర్యం కల్పించాం. 2 కోట్ల ఇళ్లు కట్టించాం. 17 వేలకుపైగా గ్రామాలకు విద్యుత్‌ సౌకర్యం కల్పించాం.

కోట్లాది మంది యువతకు ముద్ర బ్యాంకు ద్వారా రుణాలిప్పించాం. ఇంత పెద్ద ఎత్తున ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చే ప్రయత్నం గతంలో ఎన్నడూ జరగలేదు. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా దేశ గౌరవం పెరిగేలా వ్యవహరించాం.

ఈ విషయాలన్నీ క్షేత్రస్థాయికి వెళ్లాయి. ప్రజలందరికీ అన్నీ తెలుసు. అందుకే 2014 నుంచి ఇప్పటివరకు ఎక్కడ ఎన్నికలు జరిగినా మాకు రివర్స్‌ గ్రాఫ్‌ లేదు. ఆరు రాష్ట్రాల నుంచి 19 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చాం. నాలుగేళ్లలో 13 రాష్ట్రాల్లో అధికారంలోకి రావడం చిన్న విషయమా? ఇది ప్రజలు మాకిచ్చిన గుర్తింపు.

మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లలో మా పరిస్థితి చాలా బాగుంది. మిజోరంలో సంకీర్ణ ప్రభు త్వం మళ్లీ ఏర్పడుతుందన్న విశ్వాసం నాకుంది. యూపీలో మా కేడర్‌ క్షేత్రస్థాయి వరకు ఉంది. 81 లోక్‌సభ స్థానాల్లో బలంగా ఉన్నాం. 45–47 శాతం ఓటింగ్‌ ఉంది. మరో 4 శాతం పెరగాల్సి ఉంది. బూత్‌స్థాయిలో బలంగా ఉన్న మా కార్యకర్తలు అదే పనిలో ఉన్నారు.

ఇలా ఉండగా, పెట్రోల్ ధరల పెరుగుదల  తాత్కాలికమే అని అమిత్ షా చెప్పారు. అంతర్జాతీయ స్థాయి పరిస్థితులే ఇందుకు కారణం అని అంటూ చైనా, అమెరికాల మధ్య వాణిజ్య యుద్ధంతో డాలర్‌ విలువ పెరిగిందని, రూపాయి విలువ పడిపోయిందని గుతూ చేసారు.  దీనికితోడు క్రూడాయిల్‌ ధరలు కూడా పెరిగాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో చాలా సానుకూలంగా వ్యవహరిస్తోందని అంటూ పరిస్థితులను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.

మరోవంక, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మాయ మాటలతో ప్రజలను వంచించలేరని స్పష్టం చేసారు. “మేం ఆంధ్రకు వెళ్లినప్పుడల్లా అసలు విషయాలు చెబుతున్నాం. మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇప్పటికే ఈ అంశాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లే పనిలో ఉన్నారు. కానీ మాకన్నా మీడియా మద్దతు తెలుగుదేశం వాళ్లకే ఎక్కువ ఉంది కదా.!” అంటూ ప్రశ్నించారు. “ఎన్నికల కౌంటింగ్‌ వరకు ఆగండి. వాళ్లేం చేశారో ప్రజలే తీర్పు చెప్తారు. ఆంధ్ర ప్రజలు ఎవరిని విశ్వసిస్తారో మీకే అర్థమవుతుంది” అంటూ ఆంధ్రప్ర దేశ్ లోని రాజకీయ పరిస్థితులపై వ్యాఖ్యానించారు.