రాకెట్ వేగంతో దూసుకుపోతున్నఈ-కామర్స్ 

ఈ-కామర్స్ మార్కెట్.. రాకెట్ వేగంతో దూసుకుపోతున్నది. ఆర్థిక మందగమనంలోనూ నూతన అంచనాలతో పరుగులు పెడుతున్నది. నిరుడు పండుగ సీజన్‌లో ఆన్‌లైన్ అమ్మకాలు 2.9 బిలియన్ డాలర్లుగా ఉంటే, ఈసారి 3.8 బిలియన్ డాలర్లుగా నమోదు కావచ్చని పరిశ్రమ వర్గాల అభిప్రాయం. ఇందులో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లదే పైచేయి. ప్రస్తుత దేశీయ ఆన్‌లైన్ మార్కెట్‌లో 75 శాతం వాటా ఈ రెండింటిదే.

డిమాండ్ దృష్ట్యా హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో వేలాది తాత్కాలిక ఉద్యోగులనూ ఈ సంస్థలు నియమించేసుకుంటున్న విషయం తెలిసిందే. నగదు కొరత, నిరుద్యోగం వంటివి సంప్రదాయ మార్కెట్‌ను మరింతగా కుంగదీస్తున్నాయి.   ఆర్థిక మాంద్యంలోనూ ఆన్‌లైన్ మార్కెట్ జోరుగా సాగుతున్నది. ఇందుకు కారణం అవి ఇస్తున్న ఆఫర్లు, చేస్తున్న ప్రచారమే. క్యాష్‌బ్యాక్, భారీ డిస్కౌంట్లు, క్రెడిట్ సదుపాయం, ఈఎంఐ వెసులుబాటు వంటివి కస్టమర్లను కొనుగోళ్ల వైపునకు లాగేస్తున్నాయి. 

బ్యాంకులు కూడా తమ క్రెడిట్ కార్డులతో ఆన్‌లైన్ షాపింగ్ చేస్తే ఖాతాదారులకు రివార్డులిస్తుండటం మరింతగా కలిసొస్తున్నది. ఈ విషయంలో సంప్రదాయ వ్యాపారులు చాలాచాలా వెనుకబడిపోతున్నారు. ఆన్‌లైన్ సంస్థలకు ధీటుగా పోటీ ప్రకటనలతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు దుకాణదారులు. 

క్యాష్‌బ్యాక్, అప్‌టూ ఆఫర్లు, బైవన్ గెట్‌వన్, టుప్లస్‌వన్‌లతోపాటు నిర్ణీత మొత్తంలో షాపింగ్ చేస్తే బంగారం, ద్విచక్ర వాహనాలు, బంపర్ ప్రైజ్ కింద కార్లు, ఫ్లాట్లు, గృహాలనూ ఆఫర్ చేస్తున్నారు. చివరకు ఆన్‌లైన్ ధరలకూ ఇస్తామంటూ కొనుగోలుదారులను ఆకర్షించే దిశగా శ్రమిస్తున్నారు. దీంతో ఆ మేరకు కొంత విజయాన్ని వారు అందుకోగలుగుతున్నారు.

స్థానికంగా ఎంతో బలమైన కిరాణా వ్యాపార వ్యవస్థనూ ఆన్‌లైన్ మార్కెట్ ప్రభావితం చేస్తున్నది. భారతీయ రిటైల్ మార్కెట్ విలువ 600 బిలియన్ డాలర్లని అంచనా. ఇందులో ఈ-కామర్స్ మార్కెటీర్ల వాటా 5 శాతం కన్నా తక్కువే. అయితే 2022 నాటికి ఇది 8-9 శాతానికి పెరుగుతుందని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. 

ఒంటికి, ఇంటికి సంబంధించినవే కాకుండా వంటింటికీ ఆన్‌లైన్ మార్కెటీర్లు వచ్చేస్తున్నారని, కిరాణా సరుకులను తక్కువ ధరకే అందిస్తున్నాయని, తమకు గిరాకీ తక్కువైపోతున్నదని ఇప్పుడు పలువురు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం ఆన్‌లైన్ మార్కెట్ నిబంధనలు కఠినతరం చేసినా.. ఆ ప్రభావం అంతంతమాత్రమేనన్న వాదనలు సంప్రదాయ మార్కెటీర్ల నుంచి వినిపిస్తున్నాయి.

ప్రముఖ ఆన్‌లైన్ మార్కెటింగ్ సంస్థ స్నాప్‌డీల్.. మూడు ప్రత్యేక ఈ-స్టోర్లను ప్రారంభించనున్నది. కర్వా చౌత్, ధనత్రయోదశి, దీపావళి పండుగల సందర్భంగా వీటిని అందుబాటులోకి తేనున్నది. నానాటికీ పెరుగుతున్న ఆన్‌లైన్ షాపింగ్ క్రేజ్‌ను ఒడిసి పట్టేందుకు ఈ-స్టోర్లను ఉపయోగించుకోవాలని స్నాప్‌డీల్ భావిస్తున్నది. 

కాగా, ఒక్కో ఈ-స్టోర్‌లో ఆయా పండుగలకు సంబంధించిన ఉత్పత్తులన్నింటినీ కస్టమర్లు పొందవచ్చని స్నాప్‌డీల్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. కర్వా చౌత్ ఈ-స్టోర్‌లో అన్ని రకాల పూజా సామాగ్రి, ధనత్రయోదశి ఈ-స్టోర్‌లో బంగారు, వెండి నాణేలు, దీపావళి ఈ-స్టోర్‌లో ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, లక్ష్మీ, గణేశ్ ప్రతిమలు ఉంటాయని చెప్పారు.