అసెంబ్లీ ఎన్నికల్లో  ప్రధాన అంశంగా ఆర్టికల్ 370 రద్దు  

ఈ నెల 21న జరిగే మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ ప్రాధాన్య అంశాలే అధికార బీజేపీ ప్రధాన ప్రచారాస్త్రాలు కానున్నాయి. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే 370వ అధికరణం రద్దు, దేశవ్యాప్తంగా జాతీయ పౌర జాబితా (ఎన్‌ఆర్సీ), అవినీతికి వ్యతిరేకంగా మోదీ సర్కార్‌ చేపట్టిన చర్యలే ప్రధానంగా ప్రచారం సాగనున్నది. 

ప్రధాని మోదీ మహారాష్ట్రలో 9, హర్యానాలో నాలుగైదు సభల్లో, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కూడా మహారాష్ట్రలో తొమ్మిది సభల్లో పాల్గొననున్నారు. అవసరాన్ని బట్టి వారిద్దరూ అదనపు సభల్లో పాల్గొనే అవకాశం ఉన్నది. ఆర్టికల్‌ 370 రద్దుకు ప్రజల్లో చాలా ప్రోత్సాహకర వాతావరణం నెలకొన్నదని బీజేపీ అధిష్ఠానానికి ఫీడ్‌బ్యాక్‌ అందింది. అవినీతికి పాల్పడిన సీనియర్‌ విపక్ష నేతలపై ప్రభుత్వ నిర్ణయాలపైనా సానుకూలంగా ఉన్నారని నివేదికలందాయి.

కాంగ్రెస్‌ వ్యతిరేకించినా 370 అధికరణాన్ని రద్దుచేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి ప్రజాదరణ లభించడంతో ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు ప్రభుత్వానికి మద్దతు పలకడం గమనార్హం. దీంతో విపక్ష పార్టీలు ఆత్మరక్షణలో పడుతున్నాయి.  మహారాష్ట్ర, హర్యానా ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్‌, మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ నిజాయితీగా వ్యవహరిస్తూ క్లీన్‌ ఇమేజ్‌ సంపాదించుకోవడం కూడా బిజెపికి సానుకూల ప్రభావం చూపుతున్నది. 

తమ రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుకు తోడుగా జాతీయ అంశాలే ప్రధానంగా ప్రచార బరిలోకి దిగితే భారీ మెజారిటీతో విజయం సాధించగలమని బీజేపీ విశ్వసిస్తున్నది. 288 స్థానాల మహారాష్ట్ర అసెంబ్లీలో 220, 90 స్థానాలు గల హర్యానా అసెంబ్లీలో 75 స్థానాలను గెలుచుకోవాలని లక్ష్యాలుగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది.