గన్‌పార్క్‌ వద్ద ఉద్రిక్తత ఆర్టీసీ నేతల అరెస్ట్‌

అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌ పార్క్‌ వద్ద నివాళులర్పించేందుకు ఆర్టీసీ కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గన్‌ పార్క్‌ వద్దకు తరలివస్తున్న ఆర్టీసీ కార్మికులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. గన్‌ పార్క్‌ వద్ద ధర్నా, నిరసనలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. 

గన్‌ పార్క్‌ వద్ద నివాళులర్పించేందుకు వచ్చిన ఆర్టీసీ జేఏసీ నాయకులు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. తమ అరెస్టులపై ఆర్టీసీ జేఏసీ నేతలు మండిపడుతున్నారు. గన్‌ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించేందుకు వస్తే అడ్డుకొని అరెస్ట్ చేయడం దారుణమని, తమను అక్రమంగా అరెస్ట్ చేశారని అశ్వత్థామరెడ్డి తెలిపారు. అరెస్టయిన జేఏసీ నేతలను వేర్వేరు పోలీసు స్టేషన్లకు తరలించారు.  

తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ నిరాహార దీక్ష చేపట్టాలనుకున్న ఆర్టీసీ జేఏసీ నేతలు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు తలపెట్టిన ఆర్టీసీ జేఏసీ నిరాహార దీక్షను వాయిదా వేశారు. పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆర్టీసీ జేఏసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 

ఇక, తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు చేపట్టిన సమ్మె మూడో రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరోవైపు సీఎం కేసీఆర్‌ హెచ్చరికల నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళన మొదలైంది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా డిపో అధికారులు తాత్కాలిక నియామకాలు చేపడుతున్నారు. టీఎస్‌ ఆర్టీసీలో కొత్త నియామకాల నేపథ్యంలో డ్రైవర్‌, కండక్టర్‌ అభ్యర్థులు డిపోల వద్దకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.