కొత్త కంపెనీలు పెట్టుబడుల వరద 

దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నా.. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా పబ్లిక్ ఇష్యూ (ఐపీవో)కు వచ్చిన కొత్త సంస్థలకు మాత్రం లాభాలే దక్కాయి. 2019లో మొత్తం 11 సంస్థలు ఐపీవో ద్వారా స్టాక్ మార్కెట్లలోకి ప్రవేశించాయి. ఇందులో 8 సంస్థల షేర్ల విలువ.. ఆరంభంతో పోల్చితే 95 శాతం వరకు పెరిగింది. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం, ఆర్థిక మాంద్యం, దెబ్బతిన్న మదుపరుల సెంటిమెంట్.. మార్కెట్ ఒడిదుడుకులకు కారణమని నిపుణులు చెబుతున్నారు. 

అయినప్పటికీ ఐపీవోలకు డిమాండ్ బాగానే ఉందని, ఆ నమ్మకాన్ని నిరూపించేలా 70 శాతం సంస్థలు ప్రతికూల వాతావరణంలోనూ లాభాల్లో పరుగులు పెడుతున్నాయని వారు పేర్కొంటున్నారు. కాగా, ఈ ఏడాది జూలైలో స్టాక్ మార్కెట్‌లోకి ప్రవేశించిన ఇండియామార్ట్ ఇంటర్‌మెష్ లిమిటెడ్ షేర్ విలువ అత్యధికంగా 95 శాతం పుంజుకున్నది.  

ఈ ఏడాది అక్టోబర్ 4 వరకు 11 కంపెనీల స్టాక్స్ పనితీరును విశ్లేషించగా, వీటిలో ఎనిమిది ఐపిఒలు ఇష్యూ ధర కంటే 7 నుండి 95 శాతం వరకు మంచి వృద్ధిని చూపాయి. అదే సమయంలో మూడు కంపెనీలు పెట్టుబడిదారులను ఆకర్షించడంలో విఫలమై, వారి వాటాలు ఇష్యూ ధర కంటే తక్కువగా ట్రేడవుతున్నాయి.  

గత ఏడాదికి పైగా అనేక కారణాల వల్ల మార్కెట్లో ఉత్సాహం లేదు. పెట్టుబడిదారులలో సెంటిమెంట్ బలహీనంగా ఉంది. ఈ పరిస్థితిలో మంచి విలువ కలిగిన ఐపిఒ పెట్టుబడిదారులకు మంచి అవకాశాన్ని ఇచ్చింది. అంతే కాకుండా ఈ కంపెనీల పుస్తకాలు క్లీన్‌గా ఉండడం వల్ల పెట్టుబడిదారులు కూడా ఆకర్షితులవడం గమనార్హం.