కరువు మండలాలపై చలనం లేని జగన్ ప్రభుత్వం  

ఖరీఫ్‌ సీజన్‌ గడువు ముగిసి వారం గడిచినా కరువు మండలాల ప్రకటనపై వై ఎస్ జగన్  ప్రభుత్వంలో చలనం కనబడటం లేదు. సాగుకు అదను తప్పిపోయాక నైరుతి రుతుపవనాలు మరికొద్ది రోజుల్లో ముగుస్తాయనగా కురిసిన వర్షాలతో అంతా సవ్యంగా ఉందన్న యోచనలో ఉన్న ప్రభుత్వం, కరువు గుర్తింపును తాత్కాలికంగా పక్కన పడేసినట్లు కనిపిస్తోంది.

గ్రామ వలంటీర్ల, గ్రామ సచివాలయ సిబ్బంది నియామకాలు, రైతు భరోసా, ఇతర ఏర్పాట్లల్లో బిజీ బిజీగా ఉన్న జిల్లా యంత్రాంగం సైతం కరువు మండలాలపై కసరత్తును పట్టించుకోలేదు. పై నుంచి స్పందన వచ్చినప్పుడు చూద్దాంలే అని జిల్లా కలెక్టర్లు సాచివేత ధోరణిలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలే చెబుతున్నాయి.

వ్యవసాయ రాష్ట్రమైన నవ్యాంధ్రకు ఖరీఫ్‌ అత్యంత ప్రధానమైంది. దాదాపు 65-70 శాతం సాగు ఇప్పుడే సాగవుతుంది. ఈ సమయంలో ప్రభావం చూపించే నైరుతి రుతుపవనాలే కీలకం. జూన్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 30 ఖరీఫ్‌ సీజన్‌ కాగా ఆ గడువు ముగియడంతోనే ప్రభుత్వం కరువును గుర్తించి కేంద్రానికి సమాచారం పంపాలి. కేంద్ర బృందాలను రప్పించి కరువుపై అంచనా వేసి సహాయం కేంద్రం సహాయం అందించే విధంగా రాష్ట్ర సర్కారు ఒత్తిడి తేవాలి. 

రైతుల రుణాల రీషెడ్యూల్‌, కొత్త రుణాల పంపిణీ వంటి చర్యల కోసం రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ), నాబార్డు వంటి సంస్థలకు కరువుపై సవివరమైన వివరాలను పంపాలి. అయితే కరువు మండలాలపై రాష్ట్ర ప్రభుత్వంలో కనీస కసరత్తు ప్రారంభం కాలేదు. ఈ ఏడాది ఖరీఫ్‌ మొదట్లో నైరుతి రుతుపవనాలు ముఖం చాటేశాయి. ఆగస్టు నెలాఖరుకు రాష్ట్ర సగటు వర్షపాతం సాధారణ స్థాయికి చేరింది. అప్పటి వరకు లోటులోనే ఉంది. సెప్టెంబర్‌ 18 తర్వాతనే అన్ని జిల్లాలూ సాధారణ వర్షపాత స్థాయికి చేరుకున్నాయి. 

ఖరీఫ్‌లో సాధారణ వర్షపాతం 556 మిల్లీమీటర్లు కాగా ఆగస్టు నెలాఖరు నాటికి కేవలం 343 మిమీ మాత్రమే వర్షం కురిసింది. ఒక్క సెప్టెంబర్‌లో, అదీ రెండో వారం నుంచి మాసం చివరాఖరుకు 187 మిమీ పడింది. జూన్‌ నాలుగోవారం నుంచి ఆగస్టు రెండోవారం వరకు ఖరీఫ్‌ సేద్యానికి అదను. ఈ సమయంలో సరైన వానలు పడలేదు. దీంతో సేద్యం సాగలేదు. వేసిన పంటలు ఎండాయి. రాయలసీమ, ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. 

ఆగస్టు నుంచి కురిసిన వానలు మెట్ట ప్రాంతాల్లో అప్పటికే సాగు చేసిన పంటలకు ఉపశమనం కలిగించాయి మినహా కొత్త సాగు చేపట్టడానికి అక్కరకు రాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 670 మండలాలుండగా ఆదివారం (అక్టోబర్‌ 6) నాటికి 216 మండలాల్లో తక్కువ వర్షం నమోదైంది. కరువు మాన్యువల్‌ ప్రకారం వర్షపాతం, డ్రైస్పెల్స్‌, అస్సలు పంటలు సాగుకాకపోవడం, సాగైన పంటల్లో 33 శాతానికిపైగా దెబ్బతినడం వంటి ప్రధాన కొలబద్దలతో కరువును నిర్ణయిస్తారు. 

ఆ నిబంధనల కింద 250-300 మండలాల్లో కరువును ప్రకటించడానికి అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే సీజన్‌ చివరిలో కురిసిన వానలు, ఎగువ రాష్ట్రాల నుంచి నదులకు వచ్చిన వరదలు, ఈ క్రమంలో నిండిన ప్రధాన జలాశయాలు, వీటిని చూపించి కరువును ప్రకటించే విషయంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.