ఆర్టీసీ ఆస్తుల జప్తుకు కేసీఆర్ కుట్ర  

ఆర్టీసీ ఆస్తులను జప్తు చేయడానికి కేసీఆర్ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, కె.రాజిరెడ్డి, వీఎస్‌ రావు, థామస్‌రెడ్డి, రాజలింగం తదితరులు ఆదివారం కాంగ్రెస్‌, బీజేపీ, సీపీఐ, సీపీఎం, టీజేఎస్‌ పార్టీలతోపాటు పలు సంఘాల నేతలను కలిసి సమ్మెకు మద్దతు కోరారు. ఈ సందర్భంగా ఆర్టీసీపై ప్రభుత్వ తీరును అశ్వత్థామరెడ్డి ఎండగట్టారు. 

రూ.50 వేల కోట్ల ఆస్తులున్న సంస్థను ప్రైవే టుపరం చేసి, స్థిరాస్తులను హస్తగతం చేసుకోవడానికి సర్కారు కుట్రలు పన్నుతోందని ధ్వజమెత్తారు. బస్‌భవన్‌ పక్కన ఉన్న విలువైన స్థలాన్ని లీజుకివ్వడానికి సిద్ధమవుతోందని విమర్శించారు. ఇప్పటికే టీఆర్‌ఎస్‌కు చెం దిన ఓ ఎంపీ టెండర్లలో 4 ఎకరాలు దక్కించుకున్నారని ఆరోపించారు. 

ఇలాంటి ప్రయోజనాలు ఉన్నందునే కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడం లేదని ధ్వజమెత్తారు. సమ్మె చట్ట విరుద్ధమంటూ ప్రభుత్వం ప్రకటించడాన్ని ఖండించారు. ఆర్టీసీ భవిష్యత్తు కోసమే తాము సమ్మె బాట పట్టామని స్పష్టం చేశారు. ఆర్టీసీతో తనకు సంబంధమే లేదన్న రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌.. అర్ధరాత్రి ప్రెస్‌ మీట్‌ పెట్టి కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటూ ఏ హోదాతో చెప్పారని నిలదీశారు. 

అసలు తెలంగాణ ఉద్యమంలో పువ్వాడ ఏనాడైనా పాల్గొన్నారా? అని నిలదీశారు. ఆర్టీసీలో ఇంతటి దుర్భర పరిస్థితి ఎన్నడూ లేదని అన్నారు.