అటకెక్కిన గ్రామీణ ఉపాధి హామీ పథకం

కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి (ఎంజీఎన్‌ఆర్‌ఈజీ) సంబంధించిన రూ.1,845 కోట్లు విడుదల చేసినా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద ఇవ్వవలసిన రూ.615 కోట్లను విడుదల చేయకుండా గ్రామీణాభివృద్ధిని దెబ్బతీస్తోందని గుంటూరు లోక్‌సభ సభ్యుడు గల్లా జయదేవ్ కేంద్ర వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌కు ఫిర్యాదు చేశారు. 

రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్, ఎన్‌ఆర్‌జీఎస్ కమిటీ సభ్యులతో కలిసి నరేంద్ర సింగ్ తోమర్‌ను వినతిపత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం తమ వంతు నిధులు విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను విడుదల చేయకపోవటం వలన ఎంజీఎన్‌ఆర్‌ఈజీ కార్యక్రమం కుంటుపడుతోందని ఆరోపించారు. రాష్ట్ర మంత్రులను కలిసి పరిస్థితి వివరించినా ఫలితం కనిపించటం లేదని ధ్వజమెత్తారు. 

తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఈ కార్యక్రమం పకడ్బందీగా అమలైందని.. మంచి ఫలితాలను సాదించటంతోపాటు దేశ స్థాయిలో పలు పతకాలను సాధించుకున్నదని జయదేవ్ గుర్తు చేశారు. ఏపీలో ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రజలకు ఎంజీఎన్‌ఆర్‌ఈజీపై విశ్వాసం పోతుందని జయదేవ్ కేంద్ర మంత్రికి స్పష్టం చేశారు. 

ఆంధ్రప్రదేశ్‌లో ఎంజీఎన్‌ఆర్‌ఈజీ కార్యక్రమాన్ని కాపాడేందుకు వెంటనే జోక్యం చేసుకుని తగు చర్యలు తీసుకోవాలని నరేంద్ర సింగ్ తోమర్‌ను కోరారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత నాలుగు నెలల నుండి ఎంజీఎన్‌ఆర్‌ఈజీ కార్యక్రమాలు కుంటుపడ్డాయని కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు.