రాఫెల్ తో భారత వైమానిక సామర్థ్యానికి తిరుగుండదు 

ఫ్రాన్స్‌ నుంచి భారత్‌ తొలి రాఫెల్‌ యుద్ధ విమానాన్ని అందుకోనున్న నేపథ్యంలో యూరోపియన్‌ క్షిపణి తయారీ సంస్థ ఎంబీడీఎల్‌ స్పందించింది. అత్యాధునిక మెటియర్‌, స్కాల్ప్‌ క్షిపణులతో కూడిన రాఫెల్‌ యుద్ధ విమానం చేరికతో భారత వైమానిక సామర్థ్యానికి తిరుగుండదని తెలిపింది. రూ.59,000 కోట్ల వ్యయంతో 36 రాఫెల్‌ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్‌కు చెందిన దసాల్ట్‌ ఏవియేషన్‌తో భారత్‌ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. 

ఇందులో భాగంగా ఆయుధ ప్యాకేజీ కింద ఎంబీడీఎల్‌కు చెందిన మెటియర్‌ (గగనతలం నుంచి గగనతలంపైకి ప్రయోగించగల క్షిపణి), స్కాల్ప్‌ క్రూయిజ్‌ క్షిపణులు కూడా రానున్నాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మంగళవారం పారిస్‌లోని ఎయిర్‌బేస్‌ నుంచి తొలి రాఫెల్‌ యుద్ధ విమానాన్ని స్వీకరించనున్నారు. ‘రాఫెల్‌ చేరికతో భారత్‌కు ఇంతకుముందు లేని సామర్థ్యాలు దక్కుతాయి. స్కాల్ప్‌, మెటియర్‌ క్షిపణులు భారత వాయుసేనకు గేమ్‌ చేంజర్‌గా నిలువనున్నాయి’ అని ఎంబీడీఎల్‌ భారత అధిపతి లోయిక్‌ పీడెవచే తెలిపారు. 

‘అధునాతన ఆయుధ ప్యాకేజీతో కూడిన రాఫెల్‌.. అద్భుతమైన విమానం. ఈ ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు మాకు సంతోషంగా ఉంది’ అని ఆయన పేర్కొన్నారు. ‘ప్రపంచంలో దృశ్య పరిధిని మించిన క్షిపణుల్లో అత్యుత్తమమైనదిగా మెటియర్‌కు పేరుంది. ఇక స్కాల్ప్‌ క్షిపణి డీప్‌ స్ట్రైక్‌ వెపన్‌. ఈ రెండు క్షిపణులతో కూడిన రాఫెల్‌తో భారత్‌కు ఈ ప్రాంతంలో తిరుగులేని గగనతల ఆధిపత్యం దక్కుతుంది’ అని ఆయన తెలిపారు.

గగనతలం నుంచి గగనతలంపైకి ప్రయోగించగల అధునాతన క్షిపణి అయిన మెటియర్‌ అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేయగలదు. ఫాస్ట్‌ జెట్స్‌ నుంచి మానవ రహిత వైమానిక వాహనాలు, క్రూయిజ్‌ క్షిపణుల వరకు భిన్న లక్ష్యాలను ఇది ఛేదించగలదు. ఇక స్కాల్ప్‌ అనేది డీప్‌స్ట్రైక్‌ మిస్సైల్‌. స్థిరమైన లక్ష్యాలపైకి ముందస్తు పథకం ప్రకారం చేసే దాడుల కోసం దీన్ని రూపొందించారు. బ్రిటన్‌ రాయల్‌ ఎయిర్‌ఫోర్స్‌, ఫ్రెంచ్‌ ఎయిర్‌ఫోర్స్‌ వీటిని వినియోగిస్తున్నాయి. 

గల్ఫ్‌ యుద్ధంలో ఈ క్షిపణిని వినియోగించారు. రాఫెల్‌ యుద్ధ విమానాలతో వాయుసేన పోరాట సామర్థ్యం పెరుగుతుందని ఐఏఎఫ్‌ నూతన అధిపతి రాకేశ్‌ కుమార్‌ సింగ్‌ బదౌరియా ఇదివరకే పేర్కొన్నారు. క్షిపణి వ్యవస్థలతో పాటు భారత్‌ అవసరాల మేరకు పలు ప్రత్యేక మార్పులతో రాఫెల్‌ రూపుదిద్దుకుంది.

రాడార్‌ వార్నింగ్‌ రిసీవర్లు, లో బాండ్‌ జామర్లు, ఫ్లైట్‌ డేటా రికార్డింగ్‌, ఇన్‌ఫ్రారెడ్‌ సెర్చ్‌, ట్రాకింగ్‌ సిస్టమ్‌ వంటి అదనపు హంగులతో రాఫెల్‌ను డిజైన్‌ చేశారు. త్రివిధ దళాలతో భవిష్యత్‌ ప్రాజెక్టుల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని, భారత్‌కు అత్యున్నత సాంకేతికతలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని లోయిక్‌ పేర్కొన్నారు.

‘భారత్‌ మాకు వ్యూహాత్మక భాగస్వామి. భారత అవసరాలకు తగిన సాంకేతిక పరిజ్ఞానం మాకుంది. భారత నౌకాదళానికి చెందిన జలాంతర్గాములు, యుద్ధనౌకల ప్రాజెక్టుల కోసం ఎంతో ఆసక్తిగా ఉన్నాం’ అని చెప్పారు. ఐదు దశాబ్దాలుగా భారత్‌కు ఎంబీడీఎల్‌ వివిధ రకాల క్షిపణులను అందజేస్తున్నది.