ఆర్టీసీ విలీనం జరగదు, రాజీ లేదు

ఎట్టి పరిస్థితుల్లో ఆర్‌టిసిని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని,  ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసిన సిబ్బందిని విధుల్లోకి తిరిగి తీసుకునే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. దసరా పర్వదినాన సమ్మెకు దిగి, ఆర్టీసీ కార్మికులు తీవ్రమైన తప్పిదం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరుపుతూ  భవిష్యత్‌లో ఆర్టీసీకి సంబంధించిన బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు, బెదిరింపులు శాశ్వతంగా ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటామని సీఎం తెలిపారు. 

కార్మికులు చేసింది తీవ్రమైన తప్పిదమని, అన్నం పెట్టే సంస్థకు ద్రోహం, హాని తలపెట్టారని సిఎం విమర్శించారు. తద్వారా తమను తామే ఆర్‌టిసి కార్మికులు డిస్మిస్ చేసుకున్నట్టయిందని దుయ్యబట్టారు. ఇకపై ఆర్టీసీలో నడవబోయే బస్సుల్లో సగం ప్రైవేట్‌ బస్సులు కూడా నడుస్తాయని ముఖ్యమంత్రి తెలిపారు. 

రెండు మూడేళ్లలో సంస్థ లాభాల్లోకి వస్తుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. 15 రోజుల్లోగా ఆర్టీసీ పూర్వ స్థితిలోకి రావాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ సిబ్బందికి నెలకు సగటున రూ. 50 వేలు జీతం వస్తున్నప్పటికీ, ఇంకా పెంచమనడంలో అర్థం లేదని సీఎం పేర్కొన్నారు. యూనియన్‌ చేసే బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలకు ప్రభుత్వం తల వంచదని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్గో సర్వీస్‌ ద్వారా కూడా లాభాలు రాబట్టాలని సీఎం తెలిపారు.

 ప్రస్తుతం 10,400 బస్సుల్లో కోటి మంది ప్రజలు ప్రయాణిస్తున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. భవిష్యత్‌లోనూ ఆర్టీసీ సేవలు మరింత మెరుగుపరుస్తామని చెప్పారు. ఆర్టీసీలో ప్రస్తుతం మిగిలింది కేవలం 1200 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారని సీఎం అన్నారు. తక్షణ చర్యగా 2500 బస్సులను అద్దెకు తీసుకొని నడుపుతామని ఆయన ప్రకటించారు. 4,114 అద్దె బస్సులను స్టేజీ క్యారేజీగా చేస్తే వాళ్లు కూడా ఆర్టీసీలోకి వస్తారని సీఎం తెలిపారు.

అతికొద్ది రోజుల్లోనే ఆర్టీసీకి కొత్త సిబ్బంది నియామకం చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోందని సీఎం తెలిపారు. కొత్తగా చేర్చుకునే సిబ్బంది యూనియన్లలో చేరమని ఒప్పంద పత్రంపై సంతకం చేయాల్సి ఉంటుందని సీఎం తెలిపారు. కొత్త సిబ్బందికి షరతులతో కూడిన నియామకం.. ప్రొబిషనరీ పీరియడ్‌ ఉంటుందని సీఎం చెప్పారు. గడపదాటిన వారిని మళ్లీ సంస్థ లోపలికి చేర్చుకునే సమస్యే లేదని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 

ఆర్‌టిసిలో నెలకొన్న విషయాలపై కూలంకషంగా చర్చించి, ఒక నివేదిక సమర్పించడానికి రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ అధ్యక్షతన ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కమిటీలో సభ్యులుగా రవాణా శాఖ కమీషనర్ సందీప్ సుల్తానియా, టిఎస్‌ఆర్‌టిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, జాయింట్ ట్రాన్స్‌పోర్టు కమీషనర్ పాండురంగనాయకులున్నారు. ఆర్‌టిసిలో తక్షణం తీసుకోవాల్సిన అంశాలపై విపులంగా చర్చించి తమ ప్రతిపాదనలను సోమవారం ప్రభుత్వానికి సమర్పించనున్నారు.