ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి అరెస్ట్‌

నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వెంకటాచలం ఎంపీడీవో సరళ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. 

కాగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అతని అనుచరులు తన ఇంటిపైకి వచ్చి రభస సృష్టించారని వెంకటాచలం ఎంపీడీవో సరళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీరియస్‌ అయ్యారు. అధికారులతో అనుచితంగా ప్రవర్తిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించవద్దని డీజీపీ గౌతం సవాంగ్‌కు ఆయన స్పష్టం చేశారు.  

బాధితురాలు అందజేసిన ఫిర్యాదు పరిశీలించి కేసు నమోదు చేసేందుకు స్టేషన్‌ అధికారులు అందుబాటులో లేరంటూ పోలీసులు జాప్యం చేశారు. చివరకు ఆదివారం తెల్లవారుజామున వైసిపి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డిని అరెస్టు చేశారు. అనంత‌రం నెల్లూరు జిల్లా ప్ర‌భుత్వాస్ప‌త్రిలో కోటంరెడ్డికి వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.   

వైద్య ప‌రీక్ష‌ల అనంత‌రం మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచగా, మొబైల్‌ అండ్‌ స్పెషల్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ కోటంరెడ్డికి బెయిల్‌ మంజూరు చేసింది.  కాగా,    త‌న‌ను పార్టీ నుంచి దూరం చేయాల‌నే కుట్ర చేస్తున్నార‌ని శ్రీ‌ధ‌ర్‌రెడ్డి ఆరోపించారు. ఎంపిడివో చేత కేసు పెట్టించిందే మారో ఎమ్యెల్యే కాకాణి గోవ‌ర్థ‌న్ రెడ్డి అనుచ‌రుడ‌ని తెలిపారు. 

ఎస్పీ తనను వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఎన్నిక‌ల ముందు కూడా ఎస్పీ త‌న‌ను ఇబ్బంది పెట్టార‌ని పేర్కొన్నారు. అరెస్టు చేయ‌డానికి అర్థ‌రాత్రి ఇంటికి వ‌చ్చారని చెబుతూ ఫోన్‌చేస్తే పోలీస్‌ స్టేష‌న్‌కు వ‌చ్చేవాడిని..పారిపోతానా ? అని ప్ర‌శ్నించారు.  నిష్ప‌క్ష‌పాతంగా ద‌ర్యాప్తు చేయాల‌ని సిఎం జ‌గ‌న్ ఆదేశిస్తే ..ఇక్క‌డి పోలీసులు వేధిస్తున్నార‌ని దయ్యబట్టారు. 

సిఎం జ‌గ‌న్  చెప్పిందే చేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. నిజ‌మైన ఆధారాలుంటే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సిఎం చెప్పార‌ని అంటూ సిఎం నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్నాన‌ని తెలిపారు. కేసు నిజ‌మ‌ని తేలితే..త‌న‌ను పార్టీ నుంచి బ‌హిష్క‌రించ‌మ‌ని కోరారు.