నెహ్రూ అన్యాయాన్ని సరిదిద్దిన మోదీ

నాడు జవహర్‌లాల్ నెహ్రూ ఏకపక్షంగా ఆర్టికల్ 370ని విధించి జమ్మూకాశ్మీర్‌కు చేసిన అన్యాయాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం సమర్థంగా సరిదిద్దిందని బీజేపీ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి సునీల్ దియోధర్ కొనియాడారు. తాడేపల్లిగూడెంలో ఆర్టికల్ 370 రద్దుపై జరిగిన జన జాగరణ్ సభలో  ముఖ్య అతిథిగా పాల్గొంటూ ఆర్టికల్ 370 రద్దుచేయడం వల్ల మోదీ ప్రభుత్వం కాశ్మీర్ అభివృద్ధికి బాటలు వేసిందని చెప్పారు. 

స్వయంప్రతిపత్తి రద్దుతో కాశ్మీర్‌కు అన్యాయం జరుగుతుందంటూ కుహనా మేధావులు వాదిస్తున్నారని దియోధర్ ధ్వజమెత్తారు. 1954 నుంచి 370 ఆర్టికల్ రద్దుపై డిమాండ్ ఉందని చెబుతూ  నెహ్రూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జమ్మూకాశ్మీర్ ప్రజలకు తీరని అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. 70 ఏళ్లుగా రగులుతున్న కాశ్మీర్ సమస్యను పరిష్కరించిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికే దక్కుతుందని తెలిపారు. 

ఆర్టికల్ 370 వల్ల గవర్నర్‌కు ప్రత్యేక సందర్భంలో అధికారాలు అప్పగిస్తూ 1954, 1965లో ఉత్తర్వులిచ్చారని అంటూ ఆర్టికల్ 370 అంటే భస్మాసుర హస్తం వంటిదని దయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం ఆ ఉత్తర్వులు ఆధారంగానే ప్రత్యేక ప్రతిపత్తిని రద్దుచేస్తూ ఆదేశాలు ఇచ్చిందని చెప్పారు. పార్లమెంట్‌లో హోం శాఖ మంత్రి ఈ బిల్లును ప్రవేశపెట్టి రద్దుచేశారని తెలిపారు. కాశ్మీర్ అసెంబ్లీ లేనందువల్ల గవర్నర్ తన అధికారాలతో 370 ఆర్టికల్ రద్దుచేయాలని రాష్టప్రతిని కోరడంతో ఇది సాధ్యమైందని వివరించారు.

ఆర్టికల్ 370, 35ఎ రద్దుతో కాశ్మీర్‌కు బంగారు భవిష్యత్‌కు మార్గం ఏర్పడిందని పేర్కొన్నారు. విదేశీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని, దీని ద్వారా యువతకు, స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. 

రాష్ట్ర మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎంతో సాహసంతో తీసుకున్న నిర్ణయంతో కాశ్మీర్‌కు మంచి భవిష్యత్ లభించనుందని చెప్పారు. మోదీ, హోం మంత్రి అమిత్‌షాలు తీసుకున్న చర్య కాశ్మీర్‌ను అన్ని విధాల ముందుకు నడిపించేందుకు అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు.