టీటీడీ పాలకమండలి సభ్యుడి పేరు మార్చారా! 

ఇటీవల నియమించిన  టీటీడీ పాలకమండలిలో సభ్యునిగా ప్రమాణస్వీకారం చేయమని ముందుగా ఆహ్వానించి, చివరికి అదే పేరున్న మరో పారిశ్రామిక వేత్తతో చేయించారని  జాతీయ సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ సలహా మండలి సభ్యుడు రాజేష్‌శర్మ ఆరోపిస్తున్నారు. తనకు ఫోన్ ద్వారా మెసేజ్ పంపి ఆహ్వానించారని, అయితే ఈ లోగా డబ్బు చేతులు మార్చడంతో మరొకరితో ప్రమాణస్వీకారం చేయించి, తనను అవమానించారని ఆరోపించారు. 

దీనిపై తాను సుప్రీం కోర్టులో సవాల్ చేయనున్నట్టు చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారిని రాజేష్‌శర్మ దర్శించుకుని, స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ  తాను ఉన్నత చదువులు చదువుకుని, ఒక ప్రొఫెసర్‌గా ఉంటూ గత రెండు దశాబ్ధాలుగా బిజెపిలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నట్టు తెలిపారు. తనను టీటీడీ పాలకమండలి సభ్యునిగా నియమించినట్టు టీటీడీ అధ్యక్షుడి నుంచి చరవాణి మెయిల్ ద్వారా మెస్సేజ్ అందినట్టు చెప్పారు. 

గత నెల 3న ప్రమాణ స్వీకారానికి కూడా ఆహ్వానించారని, తీరా అక్కడకు వెళ్లాక ఆహ్వానించింది తనని కాదని, తన పేరుతోనే ఉన్న ముంబాయికి చెందిన మరో వ్యక్తికి పాలకమండలి సభ్యునిగా నియమించి, తనని మానసిక క్షోభకు గురిచేశారని పేర్కొన్నారు. ఈ అంశంపై ఇప్పటికే తాను ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలకు తెలియజేసినట్టు తెలిపారు. 

తనకు కేటాయించిన పాలకమండలి సభ్యుడి హోదాను డబ్బులు కోసం వేరొకరికి అమ్ముకున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పా టు చేసిన టీటీడీ నూతన పాలకమండలిలో ఆధ్యాత్మిక చింతన, సేవాగుణం ఉన్నవారు లేరని ధ్వజమెత్తారు.