రూ 40 వేల కోట్ల అదనపు నిధులు ప్రధానిని కోరిన జగన్ 

వారసత్వంగా వచ్చిన కొన్ని సమస్యలతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఆంధ్రప్రదేశ్‌కు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద అదనపు నిధులు విడుదల చేసి రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తోడ్పాటు అందించాలని ప్రధాని మోదీని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. కేంద్రం నుంచి గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద రూ.61,071.51 కోట్లు అవసరమని గత సర్కారు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో పేర్కొందని, తమ ప్రభుత్వం సమర్పించిన పూర్తి స్థాయి బడ్జెట్‌లోనూ ఇదే విషయాన్ని తెలియ చేశామని తెలిపారు. 

కానీ ఇప్పటివరకు కేంద్రం నుంచి వచ్చింది రూ. 6,739 కోట్లు మాత్రమేనని, గత ప్రభుత్వం వివిధ పనులు, పథకాలు, కార్యక్రమాలకు సంబంధించి రూ.50 వేల కోట్ల బిల్లులను పెండింగ్‌లో పెట్టిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.అందువల్ల గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద అదనంగా మరో రూ.40 వేల కోట్లు ఇవ్వాలని కోరారు. 

అక్టోబరు 15న నెల్లూరులో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకం ప్రారంభానికి హాజరు కావాల్సిందిగా ప్రధాన మంత్రిని జగన్మోహన్‌ రెడ్డి ఆహ్వానించారు. ఈ పథకం ప్రారంభం రోజునే రాష్ట్రంలో కౌలు రైతులతో సహా మొత్తం 53 లక్షల మంది అన్నదాతలకు లబ్ధి చేకూరనుందని తెలిపారు. 

అయితే చైనా అధ్యక్షుడు జింగ్‌పింగ్‌ ఈనెల 11 నుంచి మూడు రోజులపాటు భారత్‌లో పర్యటిస్తుండటం... మహారాష్ట్ర, హర్యానా శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ ఊపిరిసలపనంత బిజీగా ఉన్నందున రైతు భరోసా ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లేదని పీఎంవో వర్గాలు పేర్కొన్నాయి.  

శనివారం నాడిక్కడ లోక కళ్యాణ్‌ మార్గ్‌లో ప్రధాని మోడీని ఆయన నివాసంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగనోహ్మన్‌ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఆయనతో జగన్‌ దాదాపు గంటన్నరసేపు చర్చించారు.   

పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల మొత్తం రూ. 55,548 కోట్లు ఆమోదించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులు రూ.5,103 కోట్లను ఖర్చు చేసిందని, ఆ నిధులను తక్షణమే రీయింబర్స్‌ చేయాలని కోరారు. ప్రాజెక్టు పనులను వేగంగా జరపడానికి మరో రూ.16 వేల కోట్లు విడుదల చేయాలని కోరారు. భూసేకరణ, పునరావాస కార్యక్రమాలకే దాదాపు రూ.30 వేల కోట్లు ఖర్చు అవుతుందని వివరించారు. 

2014-19 మధ్య పోలవరం పనుల్లో అక్రమాలు చోటుచేసుకున్న నేపథ్యంలో నిపుణుల కమిటీ వేశామని, ఆ కమిటీ అభిప్రాయం మేరకు పాత కాంట్రాక్ట్‌లను రద్దు చేసి, రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించడంతో దాదాపు రూ.838 కోట్లు ఆదా అయిందని తెలిపారు.

రాయలసీమ ప్రాంతానికి ప్రధానంగా సాగు, తాగు నీటి వనరైన శ్రీశైలం రిజర్వాయర్‌కు నీటి సరఫరా గత 52 ఏళ్లుగా చూస్తే 1,230 టిఎంసిల నుంచి 456 టిఎంసిలకు పడిపోయిందని తెలిపారు. మరోవైపు గత 30 ఏళ్లుగా ఏటా సగటున ధవళేశ్వరం వద్ద 2,780 టిఎంసిల గోదావరి వరద జలాలు వృథాగా సముద్రంలో కలిసిపోతున్నాయని చెప్పారు. 

గోదావరి నీటిని నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులకు తరలించడం ద్వారా కృష్ణా డెల్టాను స్థిరీకరించడంతోపాటు, రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు సాగు నీరు సమృద్ధిగా లభిస్తుందని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మేలిమలుపు తిప్పే కృష్ణా–గోదావరి నదుల అనుసంధానానికి కేంద్రం ఆర్థికంగా సాయం చేసి ఆదుకోవాలని కోరారు. 

ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. విభజనతో రాష్ట్రం చాలా నష్టపోయిందని, ముఖ్యంగా పరిశ్రమలు, సేవా రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు. అందువల్ల ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చినట్లుగా ఆంధ్రప్రదేశ్‌కు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. పరిశ్రమలకు ప్రత్యేకంగా రాయితీలు ఇవ్వకపోతే సహజంగా పెట్టుబడిదారులు మెట్రో నగరాలైన చెన్నై, హైదరాబాద్‌, బెంగళూరు వైపు చూస్తారని ప్రధానికి వివరించారు.

ఉత్తరాంధ్ర, రాయలసీమలోని 7 వెనుకబడిన జిల్లాలకు ఒక్కో జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున ఈ ఆరు ఏళ్లలో రూ.2,100 కోట్లు రావాల్సి ఉండగా, ఇప్పటి వరకూ రూ.1050 కోట్లు మాత్రమే వచ్చాయని తెలిపారు. విభజన చట్టం ప్రకారం కడప స్టీల్‌ప్లాంట్‌, రామాయపట్నం పోర్టులను కేంద్రం నిర్మించాల్సి ఉందని, రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి ఈ ప్రాజెక్టులు ఎంతో కీలకమైనవని తెలిపారు. 

విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్‌, కాకినాడ పెట్రోలియం కాంప్లెక్స్‌కూ తగిన రీతిలో నిధులు ఇవ్వాలని కోరారు. సకాలంలో ఈ ప్రాజెక్టులు పూర్తయ్యేలా సంబంధిత మంత్రిత్వ శాఖలను ఆదేశించాల్సిందిగా కోరారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమం, సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రకటించిన నవరత్నాల (పథకాలు)కు కేంద్రం చేయూత నివ్వాలని కోరారు.