భారత్ - బంగ్లాల మధ్య సంయుక్త తీరప్రాంత నిఘా 

 నాలుగు రోజుల భారత పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రధాని మోదీతో శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఇరుదేశాల మధ్య ఏడు ఒప్పందాలు కుదిరాయి. ఇందులో ఇరుదేశాలు కలిసి సంయుక్తంగా తీరప్రాంత నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న ఒప్పందం కూడా ఉన్నది. అలాగే నీటి వనరులు, యువజన వ్యవహారాలు, సాంస్కృతికం, విద్య, వాణిజ్యం తదితర రంగాల్లో ఇరుదేశాలు పూర్తిగా సహకరించుకోవాలంటూ ఒప్పందాలు కుదిరాయి.

అంతేగాక మూడు కీలక ప్రాజెక్టులను కూడా ప్రారంభించారు. ఇందులో ఈశాన్య రాష్ట్రాలకు బంగ్లాదేశ్ నుంచి ఎల్పీజీ గ్యాస్ సరఫరా చేసే ప్రాజెక్టు కూడా ఉన్నది. చర్చల సందర్భంగా అసోంలో ఇటీవల చేపట్టిన జాతీయ పౌర జాబితా (ఎన్నార్సీ) ప్రక్రియ గురించి షేక్ హసీనా ప్రస్తావించారు. అసోంలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశ్ ప్రజలను దేశం నుంచి పంపించడానికే ఆ రాష్ట్రంలో ఎన్నార్సీని చేపట్టిన విషయం తెలిసిందే.

అయితే ఎన్నార్సీ ప్రక్రియ అనేది కోర్టు పర్యవేక్షణలో జరుగుతున్నదని, దీనికి సంబంధించిన పూర్తి పరిణామాలు ఇంకా వెల్లడి కాలేదని చర్చల సందర్భంగా అక్కడ ఉన్న అధికారులు హసీనాకు తెలిపారు. ఈ సందర్భంగా రోహింగ్యాల విషయం కూడా చర్చకు వచ్చింది. దీంతో రోహింగ్యా శరణార్థులను వారి స్వదేశమైన మయన్మార్‌కు సురక్షితంగా తరలించాలని ఇరుదేశాలు అంగీకరించాయి. అలాగే ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించివేయాలని నిర్ణయించాయి.

మోదీ, హసీనా చర్చల అనంతరం భారత్, బంగ్లాదేశ్ ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. మోదీ మాట్లాడుతూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా షేక్ హసీనా గొప్ప చర్యలను చేపడుతున్నారని, ఆసియా ప్రాంతంలో శాంతి, భద్రత, సుస్థిరతకు ఆమె ఎనలేని కృషి చేస్తున్నారని మోదీ ప్రశంసించినట్టుగా ఈ ప్రకటన పేర్కొంది. బంగ్లాదేశ్‌తో సహకారానికి భారత్ చాలా ప్రాధాన్యం ఇస్తున్నది. 

పొరుగుదేశాలైన భారత్, బంగ్లాదేశ్ మధ్య పెరుగుతున్న సన్నిహిత సంబంధాలు ప్రపంచదేశాలకు ఓ మంచి ఉదాహరణ అని మోదీ తెలిపారు. ఈరోజు తమ మధ్య జరిగిన చర్చల పట్ల తాను సంతోషంగా ఉన్నానని, ఈ చర్చలు తమ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయన్న నమ్మకం తనకు ఉన్నదని చెప్పారు.

గత ఏడాది కాలంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య మొత్తం 12 ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని, ఇందులో తాజాగా ప్రారంభమైన మూడు ప్రాజెక్టులు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు ఎంత బలంగా ఉన్నాయో తెలుపడానికి ఈ ప్రాజెక్టుల ప్రారంభమే నిదర్శనమని మోదీ వివరించారు. 

షేక్‌హసీనా స్పందిస్తూ గత ఐదేండ్ల కాలంలో బంగ్లాదేశ్, భారత్ మధ్య సంబంధాలు వేగంగా బలోపేతమయ్యాయని, ఇందులో వాణిజ్య సంబంధాలు, సముద్ర గస్తీ, పౌర అణు శక్తి రంగాల్లో సహకారం కూడా ఉన్నాయని తెలిపారని ప్రకటన తెలియజేసింది.

చర్చల అనంతరం మోదీ, షేక్ హసీనా కలిసి వీడియో లింక్ ద్వారా మూడు ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈశాన్య రాష్ట్రాలకు బంగ్లాదేశ్ నుంచి ఎల్పీజీ గ్యాస్‌ను సరఫరా చేయడం, ఢాకాలోని రామకృష్ణ మిషన్‌లో వివేకానంద భవన్‌ను ప్రారంభించడం, ఖుల్నాలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభించడం ఇందులో ఉన్నాయి. 

ప్రధాని మోదీ, షేక్ హసీనా మధ్య చర్చలు ఫలప్రదంగా జరిగాయని అధికారులు తెలిపారు. తమ దేశాల పరిధిలోని సరిహద్దులను పటిష్ఠం చేయాలని ఇరువురు నిర్ణయించినట్లు పేర్కొన్నారు.