ఇరాక్ లో 93కు చేరిన మృతుల సంఖ్య

ఇరాక్ అట్టుడుకుతున్నది. ప్రభుత్వంలో అవినీతి, నిరుద్యోగం, కనీస సౌకర్యాలలేమికి వ్యతిరేకంగా ప్రజలు గత ఐదు రోజులుగా నిరసనలు తెలుపుతున్నారు. మంగళవారం రాజధాని బాగ్దాద్‌లో మొదలైన ఆందోళనలు క్రమంగా షియా ప్రాబల్య నగరాలకు విస్తరించాయి. యువకులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. 

పలు చోట్ల ఆందోళనకారులపై పోలీసులు, సైనికులు కాల్పులు జరిపారు. ఈ ఘర్షణల్లో మరణించిన వారి సంఖ్య 93కు చేరగా నాలుగు వేల మందికిపైగా గాయపడినట్లు ఆ దేశ పార్లమెంటరీ మానవ హక్కుల కమిషన్ శనివారం పేర్కొంది. 

కాగా ప్రధాని అదిల్ అబ్దెల్ మహ్దీ రాజీనామా చేయాలని నిరసనలకు పిలుపునిచ్చిన మత గురువు మొఖ్తతా సదర్ శుక్రవారం ప్రార్థనల అనంతరం డిమాండ్ చేశారు. అయితే శుక్రవారం ప్రజలనుద్దేశించి టీవీ ద్వారా ప్రసంగించిన ప్రధాని అదిల్, మ్యాజిక్కులతో సమస్యలను పరిష్కరించలేమని చెప్పారు. గత ఏడాది ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కొంత సమయం పడుతుందని తెలిపారు. 

కాగా నిరసనకారులకు క్రమంగా మద్దతు పెరుగుతున్నది. మీ గళాన్ని విన్నాం అని స్పీకర్ మహమ్మద్ హాల్‌బుసి శనివారం వ్యాఖ్యానించారు. పార్లమెంటు సమావేశం ఏర్పాటు చేసి ఉద్యోగాల కల్పన, ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై చర్చ జరుపుతామని చెప్పారు. మరోవైపు శనివారం బాగ్దాద్‌లో కర్ఫ్యూను సడలించారు. 

నాలుగు రోజులుగా ఇండ్లకే పరిమితమైన ప్రజలు రోడ్లపైకి వచ్చి నిత్యవసర వస్తువులు, కూరగాయలను కొనుగోలు చేశారు. అయితే నిరసనల నేపథ్యంలో వీటి ధరలు రెట్టింపయ్యాయి. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుకాకపోతే నిరసనలు మరింత తీవ్రమయ్యే ప్రమాదమున్నదని స్థానిక మత పెద్దలు హెచ్చరిస్తున్నారు.