ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ ప్రభుత్వం ఉక్కుపాదం 

కార్మికులతో త్రిసభ్య కమిటీ శుక్రవారం జరిపిన చర్చలు కూడా విఫలం కావడంతో ఆర్టీసీ కార్మికులు సమ్మెకే సై అన్నారు. ముందే ప్రకటించినట్లే శనివారం (5వ తేదీ) ఉదయం 5 గంటల నుంచి సమ్మె ప్రారంభించారు. తెలంగాణ ఆర్టీసీలో నాలుగేళ్ల తర్వాత కార్మికులు సమ్మెబాట పట్టారు. అయితే, ఆర్టీసీ సమ్మెపై కఠినంగా వ్యవహరించాలని తెలంగాణ ప్రభుత్వం  నిర్ణయించింది. 

శనివారం సాయంత్రం ఆరు గంటల లోపు ఆయా ఆర్టీసీ డిపోల్లో రిపోర్టు చేసిన వారిని మాత్రమే ఇకపై ఆర్టీసీ ఉద్యోగులుగా గుర్తిస్తామని, విధులకు రాని వారిని తమంతట తాము ఉద్యోగాలు వదిలిపెట్టిన వారిగా పరిగణిస్తామని హెచ్చరించింది. డ్యూటీకి వచ్చే కార్మికులకు పూర్తి స్థాయిలో రక్షణ, ఉద్యోగ భద్రత కల్పిస్తామని.. రాని వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఉద్యోగంలో చేర్చుకోబోమని స్పష్టం చేసింది. 

ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు శుక్రవారం రాత్రి హైదరాబాద్​కు తిరిగి రాగానే ఆర్టీసీ సమ్మెపై ప్రగతిభవన్​లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీ కార్మిక సంఘాలతో జరిగిన చర్చల వివరాలను ఐఏఎస్ ల కమిటీ సీఎంకు వివరించింది. కార్మికుల డిమాండ్లను పరిశీలించి, పరిష్కరించడానికి సర్కారు సిద్ధంగా ఉందన్నా కూడా సమ్మె కొనసాగించేందుకే కార్మిక సంఘాలు మొగ్గుచూపాయని తెలిపింది.

ఆర్టీసీ పీకల్లోతు కష్టాల్లో మునిగి ఉందని.. దసరా, బతుకమ్మ పండుగల సందర్భంగా వచ్చే ఆదాయం ఎంతో కొంత ఉపయోగపడే పరిస్థితుల్లో యూనియన్లు సమ్మెకు పిలుపునివ్వడం పట్ల సీఎం కేసీఆర్​ అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఆర్టీసీలో సమ్మెలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, సమ్మె చేస్తే కార్మికులను ఉద్యోగంలోంచి తొలగించే అధికారం ఆర్టీసీకి ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ విషయంలో చట్ట ప్రకారం నడుచుకోవాలని అధికారులకు సీఎం కేసీఆర్​ సూచించారు. 

కార్మికులు ఆర్టీసీ యూనియన్ నాయకుల ఉచ్చులో పడి సంస్థకు నష్టం చేయవద్దని, తమ ఉద్యోగాలు తామే పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని కేసీఆర్ హెచ్చరించారు. కార్మికుల డిమాండ్లపై ఇక ఎలాంటి చర్చలూ ఉండవని స్పష్టం చేశారు. ఆర్టీసీని కాపాడడానికి ప్రభుత్వం ఎంతో చేసిందని, కానీ ఆర్టీసీ కార్మికులే ఆర్టీసీని ముంచే పని చేస్తున్నారని, ఈ పరిస్థితుల్లో ఆర్టీసీని కాపాడడం కష్టమని సీఎం కేసీఆర్​ అభిప్రాయపడ్డారు.