కృష్ణా– గోదావరి నదుల అనుసంధానంకు సహకరించండి   

తెలుగు రాష్ట్రాల్లో బీడు భూము లకు సాగునీరు అందించేందుకు ఆంధ్రప్రదేశ్‌తో కలసి చేపట్టనున్న కృష్ణా– గోదావరి నదుల అనుసంధానానికి ఉదారంగా సాయం అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం సాయంత్రం 4:30 గంటలకు ప్రధానితో సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు.

 ప్రధాని నివాసానికి ఒక్కరే వెళ్లిన కేసీఆర్‌... సుమారు 50 నిమిషాలపాటు సమా వేశం అయ్యారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నదుల అనుసంధానం, ఆర్థిక మాంద్యం పరిస్థితులు, ఆంధ్ర ప్రదేశ్‌ పునర్విభజన చట్టం అమలు సహా జోనల్‌ వ్యవస్థలో మార్పు వంటి పలు కీలక అంశాలపై చర్చించారు.  

ఈ సందర్భంగా కేసీఆర్ 22 అంశాలతో కూడిన వినతిపత్రాన్ని ప్రధానికి అందజేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ప్రధానికి ఇచ్చిన వినతి పత్రంలోని అంశాలు ఈ విధంగా ఉన్నాయి: 

- తెలంగాణలో వెనుకబడిన జిల్లాలకు రూ.450 కోట్లు విడుదల చేయాలి. 
- ఎన్‌హెచ్‌ఏఐ సాయంతో ఆదిలాబాద్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పునరుద్ధరించాలి. 
- తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 24 నుంచి 42కు పెంచాలి. 
- తెలంగాణలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఏర్పాటు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యూకేషన్ అండ్ రీసెర్చ్ కేంద్రం ఏర్పాటుకు అనుమతి
- కొత్త జిల్లాల్లో 23 జవహర్ నవోదయ విద్యాలయాల మంజూరు
- రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టుల పనుల పూర్తికి నిధులు విడుదల
- నీతిఆయోగ్ సిఫారసు చేసిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు ఆర్థిక సహాయం
- ఖమ్మం జిల్లాలోని బయ్యారం వద్ద స్టీల్ ప్లాంటు ఏర్పాటు
- మెదక్ జిల్లా జహీరాబాద్‌లో నిమ్జ్ ఏర్పాటుకు నిధుల విడుదల
- నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఏర్పాటు
- రాష్ట్రంలో ఎస్సీల ఉపవర్గీకరణ అంశం
- కరీంనగర్‌లో పీపీపీ మోడల్ కింద ట్రిపుల్ ఐటీ మంజూరు అంశం
- ఉపాధి, విద్యలో బీసీలకు రిజర్వేషన్ల పెంపు అంశం
- పార్లమెంటు, శాసనసభలో ఓబీసీలు, మహిళలకు 33 శాతం రిజర్వేషన్
- నాగర్‌పూర్, వరంగల్-హైదరాబాద్ పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు
- పీఎంజీఎస్‌వై కింద గ్రామాల్లో 4 వేల కిలోమీటర్ల మేర రహదారులకు నిధులు కేటాయించాలని కోరుతూ సీఎం కేసీఆర్ ప్రధాని మోదీకి వినతిపత్రం అందజేశారు.