పెట్రోల్‌, డీజిల్‌పై రూ.2 తగ్గించిన కర్ణాటక

భారీగా పెరుగుతున్న ఇంధన ధరల నుంచి కర్ణాటక రాష్ట్ర ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. రోజురోజుకీ ఇంధన ధరలు పెరుగుతున్నా దృష్ట్యా ప్రజలకు కొంత ఉపశమనం కలిగించడానికి కర్ణాటక ప్రభుత్వం రంగంలోకి దిగింది. పెట్రోల్‌, డీజిల్‌పై లీటరుకు రూ.2లు తగ్గిస్తున్నట్లు ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రకటించారు. పెట్రోల్‌, డీజిల్‌పై విధించే పన్నును తగ్గించడం ద్వారా ప్రభుత్వం ప్రజలకు కొంత ఉపశమనం కలిగించింది.

జూన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌లో పెట్రోల్‌, డీజిల్‌పై విధించే పన్నులు పెంచుతున్నట్లు కుమారస్వామి ప్రకటించారు. కొద్దిరోజులుగా చమురు సంస్థలు ఇంధన ధరలను భారీగా పెంచుతుండటంతో రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్‌ ధరలు చుక్కలనంటుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో పెట్రోల్‌ లీటరుకు రూ.84.40లు, డీజిల్‌ రూ.75.80లు వసూలు చేస్తున్నారు.

వీటిపై ప్రభుత్వం విధించే పన్ను పెంచినా, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇంధన ధరలు తక్కువని ముఖ్యమంత్రి ఇటీవల ప్రకటించారు. కానీ పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా నిత్యావసర వస్తువులు కూడా నింగిని తాకుతున్నట్లు భావించిన ప్రభుత్వం వీటిపై విధించే సుంకాన్ని తగ్గించాలని నిర్ణయించింది. దీంతో పెట్రోల్‌, డీజిల్‌ ధర లీటరుకు రూ.2లు తగ్గిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.

కాగా, ఇప్పటికే రాజస్తాన్, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులు రెండు రూపాయల చొప్పున, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒక రూపాయి చొప్పున లీటర్ కు పన్నులు తగ్గిస్తున్నట్లు ప్రకటించడం తెలిసిందే.