ముంబైలో చిత్తుచిత్తుగా కాంగ్రెస్ ఓటమి 

ముంబైలో కాంగ్రెస్‌ పార్టీ అన్ని స్థానాల్లో చిత్తుచిత్తుగా ఓడిపోతుందని, అతికష్టం మీద మూడు నుంచి నాలుగు స్థానాల్లో మాత్రమే గెలుపొందుతుందని ఓ ప్రముఖ కాంగ్రెస్ నేత జోస్యం చెప్పారు.   అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తాను సూచించిన నాయకులకు టికెట్‌ కేటాయించలేదని ఆగ్రహించిన ఆ పార్టీ సీనియర్‌ నేత సంజయ్‌ నిరుపమ్‌ పార్టీ అధిష్టానం తీరును తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారానికి రానని స్పష్టం చేశారు. 

‘రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల గురించి ఢిల్లీ నేతలకు అర్థం కావడంలేదు. వారు నిజాలు పరిగణనలోకి తీసుకోకుండా.. ఇష్టారీతిన తీసుకుంటున్న నిర్ణయాలను నేను ఖండిస్తున్నాను. అందుకే ఎన్నికల్లో ప్రచారం చేయకూడదని నిర్ణయించుకున్నా. ఇక అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగే అభ్యర్థుల ఎంపిక తీరును చూస్తుంటే అన్ని స్థానాల్లో ఓడిపోతుందని... డిపాజిట్‌ కూడా దక్కదని అర్థమవుతోంది. మహా అయితే ముంబైలో నాలుగు సీట్లలో విజయం సాధిస్తుంది" అంటూ నిర్వేదం వ్యక్తం చేశారు. 

బిజెపి-శివసేన కూటమి భారీ ఆధిక్యతతో తిరిగి గెలుపొందనున్నట్లు ఆయన మాటలు వెల్లడి చేస్తున్నాయి. నలుగురు బలమైన అభ్యర్థుల పేర్లను మహారాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ఇంచార్జి మల్లికార్జున ఖర్గేకు సూచిస్తే ఆయన తన మాటలు లెక్కచేయలేదని, వారందరి పేర్లను తిరస్కరించారని సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా రాహుల్‌ గాంధీకి సన్నిహితులుగా ఉన్న నాయకులను మెల్లమెల్లగా ఆయన నుంచి దూరం చేయాలని కొంత మంది కుట్రపన్నుతారంటూ సంజయ్‌ ఆరోపించారు.

పార్టీ బలంగా ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎటువంటి వారో తెలుసుకోకుండానే టికెట్లు కేటాయించారని విమర్శించారు. సీనియర్‌ నేతలను సంప్రదించకుండానే ఇటువంటి నిర్ణయాలు ఎలా తీసుకుంటారని మండిపడ్డారు. ప్రస్తుత విషయాల గురించి పార్టీ అధిష్టానం పట్టించుకోనట్లైతే తాను త్వరలోనే పార్టీని వీడతానని హెచ్చరించారు. 

పదిహేనేళ్ల క్రితం శివసేన నుంచి బయటికి వచ్చిన సంజయ్‌ నిరుపమ్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరి కీలక నేతగా ఎదిగారు. మూడు పర్యాయాలు ఎంపీగా పనిచేశారు. అదే విధంగా ముంబై కాంగ్రెస్‌ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. కాగా లోక్‌సభ ఎన్నికల ఫలితాల షాక్‌ నుంచి తేరుకోకముందే ఎంతో మంది సీనియర్‌ నేతలు కాంగ్రెస్‌ పార్టీని వీడిన సంగతి తెలిసిందే. 

ఇక మహారాష్ట్ర అసెంబ్లీ గడువు నవంబరు 9న ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని మొత్తం 288 స్థానాలకు ఎన్నికలు జరుగనున్న విషయం విదితమే. అక్టోబరు 21న పోలింగ్‌ జరుగనుండగా.. అదే నెల 24న కౌంటింగ్‌ జరుగనుంది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే దశలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బీజేపీ-శివసేన ఇప్పటికే దూకుడు పెంచిన సంగతి తెలిసిందే.