ప్రత్యేక విమానం వద్దన్న ఏపీ గవర్నర్ హరిచందన్  

అనవసర ఆర్భాటాలు చేయరు.. పటాటోపాలకూ దూరం.. ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చుపెట్టే మనస్తత్వం అసలే లేదు. తన వల్ల ఇతరులెవరూ ఇబ్బంది పడకూడదని గట్టిగా భావిస్తారు. ఆయనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌. 

తిరుమలలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు వెళ్లాలని ఆయన అనుకున్నారు. రాష్ట్ర ప్రథమ పౌరుడిగా ప్రత్యేక విమానంలో వెళ్లవచ్చు. ఆ మేరకు ఏర్పాట్లు చేస్తామని అధికారులూ చెప్పారు. ప్రత్యేక విమానం అంటే చాలా అద్దె ఉంటుంది.. అవసరం లేదు.. మామూలుగా అందరితో పాటే విమానంలో వెళ్తానని ఆయన చెప్పారు. 

అయితే విజయవాడ నుంచి తిరుపతికి నేరుగా వెళ్లేందుకు విమాన సర్వీసు లేదని అధికారులు తెలిపారు. పర్వాలేదు.. హైదరాబాద్‌ వెళ్లి అక్కడి నుంచి తిరుపతి చేరుకుంటానని వెళ్లారు. గురువారం ఆయన తిరుమలలో బ్రహ్మోత్సవాలకు హాజరయ్యారు.

స్వామివారిని దర్శించుకున్నారు. అయితే లక్షల రూపాయలను వృథాగా ఖర్చు చేయడం మాని.. సాధారణ విమానంలో వెళ్లారు. అంతేకాదు.. తిరుమల కొండపై కూడా ఎక్కువ సేపు ఉండలేదు. తానక్కడ అధిక సమయం గడిపితే సామాన్య భక్తులకు ఇక్కట్లు ఎదురవుతాయని భావించారు. 

తిరుమలలో గెస్ట్‌హౌ్‌సలో ఉన్నా.. ఆలయ ప్రాంగణంలో ఉన్నా.. టీటీడీ అధికారులంతా తన సౌకర్యాలమీదే దృష్టిపెడతారన్న ఉద్దేశంతో కేవలం గంట పాటే అక్కడున్నారు. దర్శనాంతరం మళ్లీ కిందకు వచ్చి.. తిరుపతి నుంచి హైదరాబాద్‌కు సాధారణ విమానంలో వచ్చారు. అక్కడి నుంచి మరో సాధారణ విమానంలో రాత్రికల్లా విజయవాడ చేరుకున్నాన్నారు.