తెలంగాణలో మార్పు అనీవార్యం

తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో నిరాశా, నిస్పృహలు అలముకున్నాయని, పేదల్లో ఈ ప్రభు త్వంపై కోపం ఎక్కువగా కనిపిస్తోందని, మార్పు అని వార్యమనే భావనలో ప్రజానీకం ఉందని బిజెపి అద్యక్షుడు అమిత్‌ షా అభిప్రాయ పడ్డారు. ధనిక రాష్ట్ర మైన తెలంగాణలో జర గాల్సిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని `సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథ కాలు తెలంగాణ ప్రజలకు దక్కకుండా ఇక్కడి ప్రభుత్వం అడ్డుకుందని ఆరోపించారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లడం వల్ల ఎవరికి ప్రయోజనమో చెప్పాలని టీఆర్‌ఎస్‌ను డిమాండ్‌ చేశారు. రాజకీయ ఎజెండాతో ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుందని చెప్పారు.

అమిత్ షా మాటలలో :

ముందస్తు ఎన్నికల వల్ల తెలంగాణ ప్రజలపై పడుతున్న ఆర్థిక భారం బీజేపీకి సమ్మతం కాదు. వాస్తవానికి రాష్ట్రాల్లోని అసెంబ్లీలకు, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు జరపాలనేది మా విధానం. తెలంగాణలో గతంలో అదే సంప్రదాయం ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని వేరు చేశారు. దీని వెనుక ఆంతర్యం ఏమిటో తెలంగాణ ప్రజలకు టీఆర్‌ఎస్‌ సమాధానం చెప్పాలి. రెండుసార్లు ఎన్నికలు జరగడం వల్ల రాష్ట్రానికి, ప్రజలకు ఏ ప్రయోజనం ఉందో చెప్పాలి. మీ రాజకీయ ఎజెండా కోసం మాపై ఇంతటి భారాన్ని మోపుతారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీన్ని ప్రజలు పూర్తిస్థాయిలో అర్థం చేసుకున్నారు.

మా ప్రభుత్వం, మా ఇష్టం అనే రీతిలో టీఆర్‌ఎస్‌ వ్యవహరించింది. ఎలాంటి రాజ్యాంగబద్ధత లేకుండానే మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని పరిమితులను దాటి హామీ ఇచ్చింది. దీన్ని తెలంగాణ ప్రజలు కూడా విశ్లేషించుకుంటున్నారు. 50 శాతంకన్నా రిజర్వేషన్లు మించకూడదని సుప్రీంకోర్టు కూడా తీర్పు చెప్పింది. మరి ఎలా ఇవ్వాలనుకున్నారు. అలా ఇవ్వాలనుకుంటే ఎవరి రిజర్వేషన్లు తగ్గిస్తారో టీఆర్‌ఎస్‌ చెప్పాలి. ఎస్సీలవి తగ్గిస్తారా, ఎస్టీలు, బీసీల కోటాలో కోత పెడతారా? దీనిపై టీఆర్‌ఎస్‌ నుంచి స్పష్టత రావాలి.

మా వ్యూహాలు నేను బహిరంగంగా చెప్పలేను. కానీ ప్రజల్లోకి వెళ్లేందుకు మాకు చాలా సానుకూలతలున్నాయి. గతంలో ఏ ప్రభుత్వం చేయనంత సాయం మోదీ ప్రభుత్వం తెలంగాణకు చేసింది. సమైక్యాంధ్రలోనూ, కేంద్రంలోనూ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 13వ ఆర్థిక సంఘం కింద కేవలం రూ. 16,500 కోట్లను తెలంగాణకు ఇచ్చారు. కానీ మోదీ ప్రభుత్వం ఇప్పటివరకు రూ. 1.15 లక్షల కోట్లు ఇచ్చింది. దీనికి అదనంగా అనేక ప్రాయోజిత పథకాల కింద మరో రూ. 1.15 లక్షల కోట్లిచ్చాం. అన్నీ కలిపి రూ. 2.30 లక్షల కోట్ల నిధులు తెలంగాణకు ఇచ్చాం.

మెట్రో రైలు, ఇళ్ల నిర్మాణం కోసం నిధులిచ్చాం. రూ. 40 వేల కోట్లతో రహదారులు నిర్మించాం. యూరియా కార్ఖానాల కోసం రూ. 5 వేల కోట్లు ఇచ్చాం. తెలంగాణ లాంటి చిన్న రాష్ట్రానికి అన్ని నిధులివ్వడం చిన్న విషయమేమీ కాదు. ఇవేమీ మేం తెలంగాణకు ఉచితంగా ఇవ్వలేదు.

ఈ నిధులను తెలంగాణ ప్రజల హక్కుగానే భావించి మంజూరు చేశాం. ఇప్పటివరకు అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమూ తెలంగాణ ప్రజలకు ఇన్ని నిధులివ్వలేదు. దీన్ని మోదీనే ప్రారంభించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను ఈ రాష్ట్రంలో నిలిపివేశారు.

ఆయుష్మాన్‌ భారత్‌ అనే పథకం కింద ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల ఆరోగ్య బీమా కల్పించే పథకాన్ని తెలంగాణలో అమలు చేయలేదు. అంటే ఆ పథకాన్ని ఉపయోగించుకునే హక్కు ఇక్కడి ప్రజలకు లేదా? రోగాల బారి నుంచి విముక్తి పొందే స్వేచ్ఛ కూడా లేదా? ఈ ప్రశ్న తెలంగాణ ప్రజల నుంచి తప్పక వస్తుంది. నేను తెలంగాణకు వచ్చినప్పుడల్లా ఇంకో విషయం చెబుతుంటాను.

హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ఎందుకు జరపరు? ఇందుకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఒత్తిడి కారణం కాదా? ఇలా విభజించి పాలించే టీఆర్‌ఎస్‌ విధానాలే ఈ ఎన్నికల్లో మాకు ప్రధానాంశాలు కాబోతున్నాయి.

తెలంగాణలో జరగాల్సినంత అభివృద్ధి జరగలేదు. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఇది ధనిక రాష్ట్రం. దేశంలో రెవెన్యూ లోటు లేని ఇలాంటి రాష్ట్రాలు చాలా తక్కువ ఉన్నాయి. ఇంకో విషయం గమనించాలి. ఇది పుట్టుకతోనే ధనిక రాష్ట్రం. గుజరాత్, ఛత్తీస్‌గఢ్‌ల తరహాలో రెవెన్యూ లోటును అధిగమించిన ధనిక రాష్ట్రంగా మారిన పరిస్థితి కూడా ఇక్కడ లేదు. కానీ ఇక్కడ సాధించింది చాలా తక్కువ. ఈ రాష్ట్రంలో పూర్తయిన ఒక్క మేజర్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు పేరు చెప్పగలరా? ఎందుకు పూర్తి కాలేదు? ఈ అంశాన్ని తప్పకుండా తెలంగాణ ప్రజలు లేవనెత్తుతారు.