ఏపీలో అతి తక్కువ స్థాయిలో ఖరీఫ్‌ సాగు   

కరువు, వరదల వంటి ప్రకృతి విపత్తులకు తోడుగా జగన్ ప్రభుత్వం సకాలంలో తగు చర్యలు తీసుకోలేక పోవడంతో ఆంధ్ర ప్రదేశ్ లో ఖరీఫ్ సాగు అతితక్కువ స్థాయిలో సాగింది. ఈ తడవ ఖరీఫ్‌ సాగును ఆరేళ్ల కనిష్టానికి దిగజార్చారు. సర్కారు నిర్ణయించిన లక్ష్యంలో 8.25 లక్షల హెక్టార్లు (సుమారు 20 లక్షల ఎకరాలు), సీజన్‌ సాధారణ సాగులో 4.51 లక్షల హెక్టార్లు (సుమారు 11 లక్షల ఎకరాలు) మేర కోత పడింది. అక్టోబర్‌ 3 నాటికి చూసుకుంటే నవ్యాంధ్ర ఏర్పడ్డాక ఈ సారి అతి తక్కువ స్థాయిలో ఖరీఫ్‌ సాగు నమోదైంది. 

ఖరీఫ్‌ సన్నద్ధత, విపత్తులనె దుర్కొనే విషయంలో కొత్తగా అధికారంలోకొచ్చిన వైసిపి సర్కారులో గందరగోళం నెలకొంది. కంటింజెన్సీ ప్రణాళికల అమలుపై అస్పష్టత ఏర్పడింది. దీంతో లక్షలాది ఎకరాలు విత్తనం పడక బీళ్లుగా మారాయి. మొత్తం మీద 20 శాతం సాగు తగ్గింది. సాగైన దాంట్లో కూడా అతివృష్టి, అనావృష్టి వలన పెద్ద ఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. పలు జిల్లాల్లో వరి, పత్తి, తదితర పంటలను తెగుళ్లు నాశనం పట్టిస్తున్నాయి. 

మామూలుగా జూన్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 30 మధ్య ఖరీఫ్‌ సీజన్‌. గత నెలాఖరుతో సీజన్‌ ముగిసింది. వెనకచిక్కి, అక్కడక్కడ నీటి సదుపాయం ఉన్న చోట్ల అక్టోబర్‌ రెండో వారం వరకు వరి నాట్లు పడతాయి. ఆ సాగు మహా అయితే 20-30 వేల హెక్టార్లలోపే ఉంటుందని అంచనా. అలా చూసినా ఈ మారు ఖరీఫ్‌లో గడచిన ఐదేళ్ల కంటే సాగు తక్కువేనని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి.

ఈ ఖరీఫ్‌లో అన్ని పంటలూ కలుపుకొని 42 లక్షల హెక్టార్లలో సాగు లక్ష్యాన్ని నిర్ణయించారు. దానిలో ఇప్పటి వరకు 33.79 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయని గురువారం విడుదల చేసిన వ్యవసాయశాఖ నివేదికలో పేర్కొన్నారు. దాని ప్రకారం లక్ష్యంలో 8.25 లక్షల హెక్టార్లు (20 శాతం) సాగు తగ్గింది. సీజన్‌కు నిర్ణయించిన సాధారణ సాగు 38.30 లక్షల హెక్టార్లు కాగా దానిలో సైతం 4.51 లక్షల హెక్టార్లు (12 శాతం) తగ్గింది. ఈ సారి దాదాపు అన్ని పంటల సేద్యం దిగజారింది. 

వరి సాధారణ సాగు విస్తీర్ణంలో 1.04 లక్షల హెక్టార్లు (7 శాతం), చిరుధాన్యాలు 23 వేల హెక్టార్లు (12 శాతం), పప్పుధాన్యాలు 36 వేల హెక్టార్లు (11 శాతం), మొత్తంగా ఆహారధాన్యాలు 1.63 లక్షల హెక్టార్లు (8 శాతం), నూనెగింజలు 2.25 లక్షల హెక్టార్లు (28 శాతం) తగ్గాయి. ఒక్క పత్తి సాగు మాత్రమే టార్గెట్‌కనుగుణంగా నూటికి నూరు శాతం సాగైంది. పత్తి సాగు 6.40 లక్షల హెక్టార్లు కాగా ఆ పంట సాగును 5.63 లక్షల హెక్టార్లకు తగ్గించాలనుకున్నారు. కానీ యథావిధిగా 6.40 లక్షల హెక్టార్లలో సాగైంది. అలసందలు, సోయాచిక్కుడు వంటివి టార్గెట్‌ను చేరినా విస్తీర్ణంలో బహు స్వల్పం.

నైరుతి రుతుపవనాలు ఖరీఫ్‌ రైతులతో దోబూచులాడాయి. ఆగస్టు ప్రారంభం వరకు సరైన వానల్లేవు. వర్షానికి వర్షానికి మధ్య అంతరాలు (డ్రైస్పెల్‌) సుదీర్ఘంగా నెలకొన్నాయి. దీంతో సాగు ఒక అడగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్న చందంగా సాగింది. కృష్ణా, గోదావరి డెల్టాలకు సైతం సీజన్‌ ఆరంభంలో నీటి కొరత ఎదురైంది. ఆగస్టు, సెప్టెంబర్‌లో ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వానలకు శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాలు నిండటంతో కాస్త ఉపశమనం లభించింది. అడపాదడపా కురిసిన వానలు కరువుతో అల్లాడుతున్న పంటలకు కాస్తంత ఉపశమనం కలిగించాయి. 

కాగా గోదావరికి రెండు మార్లు, కృష్ణకు ఒక మారు వచ్చిన వరదలు నదీపరీవాహక ప్రాంతాల్లో, లంక గ్రామాల్లోని పంటలకు నష్టం కలిగించాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలు పత్తికి నష్టం చేకూర్చాయి. మొన్నటి వరకు రాయల సీమలో దుర్భిక్షం నెలకొంది. ఇటీవలి వర్షాలు అనావృష్టి ప్రాంతాలకు ఊరట కలిగినా ఖరీఫ్‌ పంటలేసుకోడానికి అదను తప్పడంతో కొత్తగా సాగు లేదు.