ఇరాక్‌లో ప్రజా నిరసనలు ఉదృతం 

ఇరాక్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా నిరసనలు ఉద్ధృతమవుతున్నాయి. ప్రభుత్వ అవినీతి, నిరుద్యోగం, తాగునీటి సరఫరాలో ఇబ్బందులు, విద్యుత్‌ కోతలను వ్యతిరేకిస్తూ వరుసగా మూడో రోజు కూడా ప్రజలు వేలాదిగా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. 

ప్రధాన మంత్రి అదిల్‌ అబ్దెల్‌ మహ్దీ గురువారం రాజధాని బాగ్దాద్‌లో ఆంక్షలు విధించినా నిరసనకారులు ఏమాత్రం లెక్కచేయలేదు. 

దేశ చిహ్నమైన లిబరేషన్‌ స్కేర్‌ వద్దకు భారీ ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించారు. మోహరించిన పోలీసులు, సైనికులు కాల్పులు జరిపారు. వందల సంఖ్యలో జనం గాయపడగా దవాఖానలకు తరలించారు.

కాగా ప్రభు త్వం గద్దె దిగేంతవరకు ఆందోళనలు కొనసాగిస్తామని నిరసనకారులు చెబుతున్నారు. మంగళవారం బాగ్దాద్‌లో ప్రారంభమైన నిరసనలు క్రమంగా షియా ప్రాబల్య నగరాలకు వ్యాపించాయి. గురువారం పలు చోట్ల ఆందోళనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. 

పోలీసులు కాల్పులు జరుపగా 15 మందికి పైగా మృతి చెందారు. ఆందోళనల కారణంగా మూడు రోజుల్లో మృతి చెందిన వారి సంఖ్య 28కి చేరింది. చనిపోయిన వారిలో ఇద్దరు పోలీస్‌లు కూడా ఉండగా వెయ్యి మందికిపైగా గాయపడినట్లు తెలుస్తున్నది.