గోవాలో నాయకత్వ మార్పు ప్రసక్తే లేదు

గోవాలో నాయకత్వ మార్పు ఉండబోదని బీజేపీ నాయకత్వం స్పష్టం చేసింది. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో వైద్యం కోసం చేరిన ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ బాగానే ఉన్నారని పేర్కొంది. గోవాలో రాజకీయ పరిస్థితుల్ని అధ్యయనం చేసేందుకు ముగ్గురు సభ్యుల కమిటీని బీజేపీ అగ్రనాయకత్వం ఆదివారం పంపించింది. ఈ ముగ్గురు నేతలు గోవా ప్రభుత్వంలోని భాగస్వామ్య పక్షాలతో మాట్లాడారు.

అనంతరం కమిటీలోని సభ్యుడైన బీజేపీ జాతీయ కార్యదర్శి ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, ప్రస్తుతం గోవా ప్రభుత్వానికి వచ్చిన సమస్యలేమీ లేవని, ఎవరూ నాయకత్వ మార్పును కోరడం లేదని చెప్పారు. క్లోమ గ్రంథి వ్యాధితో బాధపడుతున్న మనోహర్ పారికర్.. శుక్రవారం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. తనను సీఎం బాధ్యతల నుంచి తప్పించాలని ప్రధాని మోదీ, అమిత్‌షాలతో పారికర్ చర్చించినట్టు వార్తలు వచ్చాయి. దీంతో గోవాలో ముఖ్యమంత్రిని మార్చబోతున్నరనే కధనాలు వెలువడ్డాయి.  

ముఖ్యమంత్రి పీఠంపై అటు మిత్రపక్షాల అభ్యర్థులతోపాటు 16 మంది సభ్యులున్న కాంగ్రెస్ కూడా కన్నేసింది. పరిస్థితుల అధ్యయనానికి పార్టీ ప్రధాన కార్యదర్శులు బీఎల్ సంతోష్, రామ్‌లాల్‌తోపాటు గోవా రాష్ట్ర శాఖ ఇంచార్జీ విజయ్ పురానిక్‌లతో కూడిన కమిటీని బీజేపీ గోవాకు పంపింది. వీరు రెండురోజులపాటు గోవాలో ఉండి బీజేపీ, మిత్రపక్షాలైన గోవా ఫార్వర్డ్ పార్టీ (జీఎఫ్‌పీ), మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ (ఎంజీపీ) నాయకులతోపాటు ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు తెలుపుతున్న స్వతంత్ర సభ్యులతో వరుస భేటీలు జరిపారు. ఈ భేటీల అనంతరం ముఖ్యమంత్రి మార్పును ఎవ్వరు కోరుకోవడం లేదని స్పష్టమైనది.  

అంతకు ముందు, మిత్రపక్షాల సూచనలను పరిగణలోకి తీసుకొని సీఎం అభ్యర్థిని అధినాయకత్వం ఎంపికచేస్తుందని, జీఎఫ్‌పీ, ఎంజీపీలు బీజేపీలో విలీనమైన తర్వాతనే సీఎం అభ్యర్థి ఎవరనేది తేలుస్తామనే కొత్త ప్రతిపాదన తీసుకొచ్చినట్టు ప్రస్తుతం గోవా డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న మైఖెల్ లోబో తెలిపారు. అయితే ఈ విషయమై మద్దతు ఇస్తున్న వారిలో ఏకాభిప్రాయం ఏర్పడలేదని తెలుస్తున్నది. 40 మంది ఎమ్మెల్యేలున్న గోవా అసెంబ్లీలో బీజేపీకి సొంతంగా 14 మంది, మిత్రపక్షాలకు 10 మంది సభ్యులున్నారు.