హర్యానా కాంగ్రెస్‌లో భగ్గుమన్న అసంతృప్తి జ్వాలలు 

అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపుల వేళ హర్యానా కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు భగ్గుమంటున్నాయి. రాష్ట్రంలో అసెంబ్లీ టికెట్ల పంపిణీ అంశం కాంగ్రెస్‌ పార్టీని ఓ కుదుపు కుదుపుతోంది. టికెట్ల పంపిణీ వ్యవహారంలో తీవ్ర అంసతృప్తితో ఉన్న హరియాణా కాంగ్రెస్‌ మాజీ చీఫ్‌ అశోక్‌ తన్వార్‌ బుధవారం ఏకంగా ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎదుట ఆందోళన నిర్వహించారు. 

అంతేకాకుండా పార్టీ తాత్కాలిక జాతీయ అధ్యక్షురాలు సోనియాగాంధీ నివాసం ఎదుట కూడా ఆయన నిరసన ప్రదర్శన చేపట్టారు. సోనియా ఇంటి ముందు ఆయన మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. నిన్నకాక మొన్న పార్టీలో చేరిన వారికి పార్టీ అధిష్ఠానం టిక్కెట్లు ఇచ్చి, ఏళ్ల తరబడి పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలను అలక్ష్యం చేస్తోందని అశోక్ తన్వర్ ఆరోపించారు. 

ప్రదర్శకులను ఉద్దేశించి తన్వర్ మాట్లాడుతూ, ఏళ్ల తరబడి తాను పార్టీ కోసం కష్టపడుతూ వచ్చానని, కేవలం 15 రోజుల క్రితం పార్టీలో చేసిన వారికి పార్టీ టిక్కెట్లు ఇస్తోందని దయ్యబట్టారు. గురుగావ్‌లోని సోహ్నా అసెంబ్లీ సీటును 'రూ.5 కోట్లకు అమ్ముకున్నారు' అని ఆయన ఆరోపించారు. క్లిష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన వారికి కాకుండా కొత్తవారికి టిక్కెట్లు ఇస్తే వాళ్లెలా గెలుస్తారని ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ పార్టీ నుంచి గతంలో వెళ్లిపోయినవారు 14మంది ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేలుగా ఉన్నారని, బీజేపీ ఎంపీల్లో ఏడుగురికి కాంగ్రెస్‌ నేపథ్యముందని తెలిపారు. గత మూడు నెలల్లో తనను బీజేపీలో చేరాల్సిందిగా ఆ పార్టీ నేతలు ఆరుసార్లు ఆఫర్‌ ఇచ్చారని, అయినా, తాను కాంగ్రెస్‌ను వీడబోనని స్పష్టం చేశారు. పార్టీ కోసం గత ఐదేళ్లుగా పనిచేస్తున్న వారిని టికెట్ల పంపిణీలో విస్మరిస్తున్నారని అశోక్‌ తన్వార్‌ ఆవేదన వ్యక్తం చేశారు.  

పార్టీ రాష్ట్ర నాయకత్వం బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తోందని తన్వర్ ఆరోపించారు. రణ్‌దీప్ సింగ్‌ సూర్జేవాలాతో తనకు వ్యక్తిగతంగా సమస్యలు ఉన్నప్పటికీ, పార్టీ కోసం ఆ విభేదాలను పక్కనపెడుతూ వచ్చానని ఆయన చెప్పారు.

కాగా, అర్హులు కాని వ్యక్తులకు భూపేందర్ సింగ్ హుడా, పార్టీ హర్యానా వ్యవహారాల చీఫ్ గులాం నబీ ఆజాద్ టిక్కెట్లు ఇస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపించారు. ఆజాద్‌కు వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. ఈనెల 21న హర్యానా ఎన్నికలు జరుగనున్నాయి. 24న ఫలితాలు వెలువడతాయి.