బెంగళూరు మేయర్‌ గా బీజేపీ అభ్యర్థి గౌతమ్‌ కుమార్‌  

బీబీఎంపీలో ఎట్టకేలకు బీజేపీ పాగా వేయగలిగింది. కెంపేగౌడ పౌర సభా భవనంలో మేయర్‌, ఉప మేయర్‌ పదవులకు మంగళవారం ప్రాంతీయ కమిషనర్‌ రిటర్నింగ్‌ అధికారి డాక్టర్‌ హర్ష గుప్తా ఆధ్వర్యంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. బీజేపీ మేయర్‌ అభ్యర్థి గౌతమ్‌ కుమార్‌కు 129 ఓట్లు రాగా కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఉమ్మడి అభ్యర్థి ఆర్‌.ఎ్‌స.సత్యనారాయణకు 112 ఓట్లు లభించాయి. 

ఉదయం 11.30 గంటలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అవుతూనే కాంగ్రెస్‌ తరుపున బి.ఎ్‌స.సత్యనారాయణ, బీజేపీ తరుపున గౌతమ్‌ కుమార్‌, పద్మనాభ రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్లన్నీ సక్రమంగా ఉండడంతో ఉప సంహరించుకునేందుకు కొంత సమయం కేటాయించారు. బీజేపీ సీనియర్‌ నేతల సూచనతో పద్మనాభ రెడ్డి తన నామినేషన్‌ను ఉప సంహరించుకున్నారు. బరిలో ఇద్దరు అభ్యర్థులు మిగలడంతో ఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది. సీక్రెట్‌ బ్యాలెట్‌ ద్వారా కాకుండా చేతులెత్తడం ద్వారా ఎన్నిక నిర్వహించారు.

17 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి గౌతమ్‌ కుమార్‌ మేయర్‌గా ఎన్నికైనట్లు రిటర్నింగ్‌ అధికారి ప్రకటిస్తూనే సభలో ఉన్న బీజేపీ నేతలు ఆర్‌.అశోక్‌, రవిసుబ్రమణ్య, విశ్వనాథ్‌లు విజయసంకేతాలు చూపిస్తూ హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. అనంతరం ఉప మేయర్‌ పదవికి ఎన్నిక నిర్వహించారు. బీజేపీ తరుపున గురుమూర్తి రెడ్డి, మహాలక్ష్మీ, రామమోహన్‌ రాజులు నామినేషన్‌లు దాఖలు చేశారు. చివరికి బరి నుంచి మహాలక్ష్మీ, గురుమూర్తి తప్పుకోవడంతో ఎన్నిక నిర్వహించగా బీజేపీ ఉప మేయర్‌ అభ్యర్థి రామమోహన్‌ రాజుకు అనుకూలంగా 129 ఓట్లు, వ్యతిరేకంగా 108 ఓట్లు వచ్చాయి. 

జేడీఎస్ కు చెందిన గంగమ్మకు అనుకూలంగా 116 ఓట్లు, వ్యతిరేకంగా 121 ఓట్లు వచ్చాయి. అత్యధిక ఓట్లు పొందిన రామమోహన్‌ రాజు గెలుపొందినట్లు రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు. మేయర్‌, ఉప మేయర్‌లుగా బీజేపీ అభ్యర్థులే గెలుపొందడంతో సభలో హర్షధ్వానాలు మిన్నంటాయి. 

నగర సర్వతోముఖాభివృద్దే తన ఏకైక లక్ష్యం అని నూతన మేయర్‌ గౌతమ్‌ కుమార్‌ జైన్‌ పేర్కొన్నారు. మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మేయర్‌గా తనకు అవకాశం కల్పించినందుకు పార్టీ అధిష్టానానికి, బీజేపీ నేతలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నగర ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించే అంశంపై దృష్టి సారిస్తానన్నారు. ఉపమేయర్‌గా ఎన్నికైన రామమోహన్‌రాజు తెలుగువారు కావడం విశేషం.