ప్రతి పౌరుడికి ఆధునిక వైద్యసేవలు  

దేశంలోని ప్రతి పౌరుడికి ఆధునిక వైద్యసేవలు అందుబాటులోకి రావాలని, దీని కోసమే ప్రభుత్వం ప్రతిక్షణం కృషి చేస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. నరేంద్ర మోదీ మంగళవారం ఆయుష్మాన్ భారత్, పీఎంజే-ఏవై కార్యక్రమం ప్రారంభించి ఏడాది అవుతున్న సందర్భంగా ఏర్పాటైన ఓ కార్యక్రమంలో ముగింపు ఉపన్యాసం ఇస్తూ ఆయుష్మాన్ భారత్, పీఎంజే-ఏవై, ఆయుష్మాన్ భారత్ స్టార్టప్ గ్రాండ్ చాలెంజ్ పేరుతో ఒక యాప్‌ను ప్రారంభించారు. 

దేశ ప్రజలందరికీ నాణ్యమైన వైద్య సదుపాయాలు కల్పించాలనే లక్ష్యాన్ని ఆయుష్మాన్ భారత్ ద్వారా సాధిస్తున్నామని మోదీ ప్రకటించారు. ఆరోగ్యకరమైన భారత దేశాన్ని సాధించేందుకు ఆయుష్మాన్ భారత్ సంపూర్ణమైన సమాధానమని ప్రధాని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయటంలో ఎదురవుతున్న సమస్యలు, సవాళ్ల గురించి ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. నూతన భారత దేశం చేపట్టిన విప్లవాత్మక పథకం ఆయుష్మాన్ భారత్ అని నరేంద్ర మోదీ వెల్లడించారు. 

సగటు మనిషికి కొత్త జీవితం ఇవ్వటంలో కీలక పాత్ర నిర్వహిస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకం దేశంలోని 130 కోట్ల మంది ప్రజల సమష్టి శక్తికి చిహ్నమని చెప్పారు. ‘ఆయుష్మాన్ భారత్ దేశంలోని ప్రతి ఒక్కరికి వైద్య సదుపాయం కలిగిస్తోంది. ప్రజలు తమకు నచ్చిన చోట వైద్యం చేయించుకునేందుకు ఈ పథకం వీలు కల్పిస్తోంది’అని ఆయన పేర్కొన్నారు. చాలా మంది మెరుగైన వైద్యం లభించే చోటికి వెళ్లి వైద్యం చేయించుకునేందుకు పథకం వీలు కల్పిస్తోందని ఆయన చెప్పారు. 

ఆయుష్మాన్ భారత్ పథకం అమలులో లేనప్పుప్పుడు వైద్య సదుపాయం, సేవల విషయంలో ప్రజలు అనేక ఇక్కట్టు పడే వారని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పుడు యాభై వేల మంది రోగులు మెరుగైన వైద్యం కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లి వైద్యం చేయించుకోగలిగారని ప్రధాన మంత్రి వెల్లడించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఈ పథకం ద్వారా వైద్యం చేయించుకుంటున్నారని మోదీ చెప్పారు. పథకం మొత్తం పద్దెనిమిది వేల ఆసుపత్రుల్లో అమలవుతుంటే ఇందులో దాదాపు పదివేల ఆసుపత్రులు ప్రైవేట్ రంగంలోనివేనని ఆయన వెల్లడించారు. 

ఆయుష్మాన్ భారత్ పథకంలో కొన్ని లొసుగులు ఉన్నాయని వాటిని సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రధాని ప్రకటించారు. ఈ పథకం మరింత విస్తరించటం వలన రానున్న ఆరేడు సంవత్సరాల్లో దాదాపు పదకొండు లక్షల మందికి అదనంగా ఉపాధి లభిస్తుందని, దేశంలోని దాదాపు నలభై లక్షల పేద కుటుంబాలకు వైద్య సదుపాయం కలుగుతుందని తెలిపారు. ‘ఈ పథకాన్ని అమలు చేసిన ఒక్క సంవత్సరంలో ఎన్నో నేర్చుకున్నాం. అందరి అభిప్రాయాలు తెలుసుకున్నాం. చాలా మంది అనుమానాలను నివృత్తి చేశాం. ఈ ప్రక్రియ ఇక మీదట కూడా కొనసాగిస్తాం’అని ఆయన ప్రకటించారు. 

వైద్య సేవల నాణ్యత పెంచేందుకు తగు చర్యలు తీసుకుంటామని మోదీ హామీ ఇచ్చారు. పేద ప్రజలకు స్వల్ప ధరలకు మంచి వైద్య సేవలు అందజేసేందుకు గతంలో కూడా ప్రయత్నాలు జరిగినా ఫలించలేదని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ ఆ లోటును తీర్చిందని చెప్పారు.