అధికారం శాశ్వతమనుకోకు జగన్!

తమ ప్రభుత్వం 51 శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చినందున అధికారం శాశ్వతమని భావించకూడదని, జగన్ చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ హితవు చెప్పారు. గతంలో పీవీ నరసింహారావు 1972లో, ఎన్టీఆర్ 1994లో ఇలాగే భారీ ఆధిక్యంతో, జగన్ కన్నా ఎక్కువశాతం ఓట్లతో  అధికారంలోకి వచ్చినా తొమ్మిది నెలలకు మించి  నిలవలేకపోయారని ఆయన గుర్తుచేశారు. ప్రజల్లో వ్యతిరేకత లేకున్నా, ఎమ్మెల్యేల్లో వ్యతిరేకత లేకుండా చూసుకోవాలని, తమకు ముఖ్యమంత్రి ప్రాధాన్యమిస్తున్నారని వారు భావించేలా నడుచుకోవాలని సూచించారు. 

ఇప్పటికే రాష్ట్రంలో విద్యుత్ సరఫరా తీరుపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని తెలిపారు. కారణాలేవైనా ప్రజలకు అనవసరమని, అంతిమంగా సరఫరా జరిగిందా లేదా అనేదే వారు చూస్తారని చెప్పారు. నవరత్నాల్లో ఏ ఒక్కటి సరిగా అమలుకాకపోయినా సొంత వారి నుండే తీవ్ర వ్యతిరేకత వస్తుందని గుర్తించాలని హెచ్చారించారు. అతి ధీమా పనికి రాదని, స్వయంకృషితో వచ్చిన అరుదైన అవకాశాన్ని జారవిడుచుకోకుండా జాగ్రత్తగా నడుచుకోవాల్సిన అవసరం జగన్‌కు ఉందని పేర్కొన్నారు. 

కొత్త ఇసుక విధానం కూడా గాడిలో పడుతుందని అనుకుంటున్నానని, గ్రామాల స్థాయిలో సచివాలయ వ్యవస్థ కొత్త ప్రయోగం కాబట్టి ఫలితాల కోసం ఎదురుచూడాలని తెలిపారు. కచ్చులూరు బోటు ప్రమాదం చాలా దురదృష్టకరమని ఉండవల్లి పేర్కొన్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగినా చెడ్డపేరు ప్రభుత్వానికే వస్తుందని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. పోలవరం రివర్స్ టెండరింగ్‌లో ఇంత తేడా వస్తుందని ఊహించలేదని, ఎడమ ప్రధాన కాలువలో పాత టెండరుదారే రూ.56 కోట్లు తక్కువతో ముందుకు రావడం ఆశ్చర్యమేనని చెప్పారు. 

తనకున్న సమాచారాన్ని బట్టి చూస్తే జగన్ ప్రభుత్వం నిజాయితీగా నడవడానికి ప్రయత్నిస్తోందని, ఉన్నత స్థాయిలో అవినీతి చాలావరకు కంట్రోల్ అయిందని, దిగువ స్థాయిలో మాత్రం యథావిధిగా సాగుతోందని ఉండవల్లి పేర్కొన్నారు. జగన్ తాను మంచిగా ఉన్నానని అందరూ మంచిగా ఉంటారని అనుకోవద్దని, అందరూ మంచిగా ఉండక తప్పని పరిస్థితి తీసుకురావాలని హితవు చెప్పారు.