టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య చీకటి ఒప్పందాలు  

టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకున్నాయని, ఎప్పటికైనా అవి కలిసిపోయే పార్టీలేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ఆరోపించారు.  హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎ్‌సకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే సీపీఐతో కాళ్లబేరానికి వెళ్లిందని దుయ్యబట్టారు. 

నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నిక ఫలితమే హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలోనూ పునరావృతమవుతుందని భరోసా వ్యక్తం చేశారు. సీఎం కుమార్తెను ఓడించిన చరిత్ర బీజేపీకి ఉందన్న విషయాన్ని లక్ష్మణ్ గుర్తు చేశారు. పగలు కుస్తీ, రాత్రి దోస్తీ చేస్తున్న ఉత్తమ్‌, కేటీఆర్‌ల చీకటి ఒప్పందాలను బయట పెడతామని స్పష్టం చేశారు. 

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలిస్తే కేసీఆర్‌ ఫాంహౌస్‌ వద్ద కాపాలా ఉంటారని, కాంగ్రెస్‌ గెలిస్తే ఉత్తమ్‌ కుటుంబానికి మేలు జరుగుతుందని చెప్పారు. బిజెపి అభ్యర్థి డా. కోట రామారావు ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజాసేవ చేసేందుకు ముందుకు వచ్చారని తెలిపారు.

కాగా హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికను బీజేపీ ఒక ముఖ్య ఘట్టంగా భావిస్తోందని ఆ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు పేర్కొన్నారు. సిద్ధాంతాల్లో వైరుధ్యాలు లేవన్న సీపీఐ నేతలు.. ఆ పార్టీని టీఆర్‌ఎ్‌సలో కలిపేయవచ్చు కదా! అని సూచించారు. తెలంగాణ సమస్యలపై సీపీఐ ఇక గొంతు విప్పలేదన్నది స్పష్టమయిపోయిందని ధ్వజమెత్తారు.