హర్యానా బిజెపి జాబితాలో ముగ్గురు ప్రముఖ క్రీడాకారులు 

క్రీడల్లో సత్తా చాటిన ముగ్గురు ప్రముఖ క్రీడాకారులు తాజాగా జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ముగ్గురు ప్రముఖ క్రీడాకారులు రెజ్లర్లు బబితా ఫోగట్ (దాద్రీ), రెజ్లర్ యెగేశ్వర్ దత్ (బరోడా), హాకి జట్టు మాజీ కెప్టెన్ సందీప్ సింగ్ (పెహోవా)లకు బీజేపీ టికెట్లు లభించాయి.

2014,2018 కామన్ వెల్త్ గేమ్స్ లో రెజ్లింగ్ లో బంగారుపతకాలు సాధించిన బబితా కుమారి ఫోగట్ ఈ ఏడాది ఆగస్టు 12వతేదీన బీజేపీలో చేరారు. రెజ్లింగ్ లో పలు పతకాలు సాధించిన రెజ్లర్ బబితా కుమారి దాద్రీ నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. 

భారత హాకి జట్టు కెప్టెన్ గా పనిచేసిన సందీప్ సింగ్ పలు పతకాలు సాధించారు. 2006 ఆగస్టు 22వతేదీన కల్కా శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలులో వస్తుండగా ప్రమాదానికి గురై ఏడాది పాటు వీల్ ఛైర్ కే పరిమితమయ్యాడు. అనంతరం కోలుకున్న సందీప్ సింగ్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో తన సత్తా చాటుకునేందుకు సమాయత్తమయ్యాడు. 

పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన రెజ్లర్ యోగేశ్వర్ దత్ 2014 కామన్ వెల్త్ గేమ్స్ లో బంగారుపతకం సాధించారు. ఆసియా క్రీడోత్సవాలు, సమ్మర్ ఒలింపిక్స్ లోనూ పలు పతకాలు సాధించిన యోగేశ్వర్ తాజాగా బీజేపీ అభ్యర్థిగా బరోడా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. క్రీడల్లో పతకాల పంట పండించిన ఈ ముగ్గురు క్రీడాకారులు ఎన్నికల్లో ఏమేర సత్తా చూపుతారో ఓటర్ల తీర్పు కోసం వేచి చూడాల్సిందే.  

అక్టోబర్ 21న జరుగనున్న హర్యానా అసెంబ్లీ  ఎన్నికలకు సంబంధించి 90 స్థానాలకులు బీజేపీకి 78 అభ్యర్థుల పేర్లను గతరాత్రి ప్రకటించింది. వారిలో ఇద్దరు ముస్లిం అభ్యర్థులు కూడా ఉన్నారు. గత ఎన్నికలలో 47 స్థానాలను గెలుపొంది బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వారిలో 38 మందికి తిరిగి సీట్లు ఇవ్వగా, ఏడుగురికి నిరాకరించారు.